వైసీపీకి చెందిన నాయకుడు, సీనియర్ అధికారి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వరప్రసాద్.. తాజాగా వైసీపీపై ఫైరయ్యారు. తనకు టికెట్ లేదని చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అంతేకాదు..ఈ సందర్భంగా గతాన్ని తవ్వేశారు. తాను.. ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి వచ్చానని.. వైసీపీ కష్టంలో ఉన్నప్పుడు.. తాను పార్టీలో కొనసాగానని.. ఓటమి ఎరుగని నేతగా ముందుకు సాగానని వ్యాఖ్యానించారు.
తిరుపతిలో టికెట్ ఇచ్చారు.. గెలిచాను. గూడూరు వెళ్లమన్నారు.. వచ్చి ఇక్కడా గెలిచాను. నేను చేసి తప్పేంటి? అని ఆయన ప్రశ్నించారు. అయితే.. ఇదంతా సాధారణ ఎమ్మెల్యేలు, లేదా టికెట్ రానివారు చెప్పే మాట. కానీ వరప్రసాద్ మరో అడుగు ముందుకు వేశారు. తాను కూడా సర్వేలు చేయించినట్టు చెప్పారు. ఈ సర్వేల్లో సీఎం జగన్ 59 శాతం అనుకూలంగా రిజల్ట్ వస్తే.. తనకు 57 శాతం అనుకూలంగా రిజల్ట్ వచ్చిందని అన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
ఇక, పార్టీల పరంగా చూసుకుంటే.. వరప్రసాద్ సీనియర్ అధికారి, మాజీ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికూడా కావడంతో జనసేన నుంచి ఆయనకు అవకాశం లభించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆయన జనసేన అధినేత పవన్‌తో భేటీఅయి చర్చించారు. కానీ, తాను టికెట్ కోసం.. వెళ్లలేదని చెబుతున్నా.. వాస్తవానికి ఆయన వెళ్లింది అందుకోసమే. ఈ దఫా.. ఆయన తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, ఇప్పటికే తిరుపతి టికెట్‌ను టీడీపీ-జనసేన మిత్రపక్షం దాదాపు మహిళకు కేటాయించేసింది.
ఈ నేపథ్యంలో వరప్రసాద్ ఎలాంటి టర్న్ తీసుకుంటారనేది చూడాలి. మరోవైపు.. తాను ఒంటరిగా అయినా పోటీ చేస్తానని వరప్రసాద్ పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న పోటీలో రాజకీయ పార్టీల దూకుడులో ఒంటరిగా పోటీ చేసి విజయం దక్కించుకునే రేంజ్‌లో అయితే వరప్రసాద్ రాజకీయాలు లేవని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా ఎస్సీ నాయకులు.. కోనేటి ఆదిమూలం కావొచ్చు.. రక్షణనిధి కావొచ్చు.. ఇలా.. కొందరు నాయకులు వైసీపీకి దూరంగా జరగడం ప్రస్తుతం చర్చ నీయాంశం అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates