ఆ సీటుకు టీడీపీలో మంచి డిమాండ్

ఆ టికెట్ నాకే ఇవ్వండి.. కాదు నాకే ఇవ్వండి- ఇదీ ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఒక కీల‌క నియోజక‌వ‌ర్గం నుంచి వ‌స్తున్న, వినిపిస్తున్న డిమాండ్లు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు టికెట్ల కేటాయింపుపై యుద్ధ‌మే చేస్తున్నారు. అనేక మంది ఆశావ‌హులు, వార‌సులు, సీనియ‌ర్లు, పొత్తు పార్టీ.. ఇలా ఎటు చూసినా ఎన్నో అడుగులు ఆచి తూచి వేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి అనంత‌పురం(ప్ర‌స్తుతం స‌త్య‌సాయి జిల్లా)లోని మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం టీడీపీలో కాక పుట్టిస్తోంది.

మ‌డ‌కశిర నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీల‌కు కేటాయించారు. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. తిప్పేస్వామి ఇక్క‌డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే.. ఈ ద‌ఫా టీడీపీ నుంచి ఈర‌న్న కుటుంబం స‌హా.. మ‌రో ఇద్ద‌రు టికెట్ ఆశిస్తున్నారు. అంద‌రూ పార్టీకి కావాల్సిన వారే కావ‌డం.. పైగా.. బ‌లమైన కేడ‌ర్ ఉన్న‌వారే కావడంతోఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నే విష‌యంపై పార్టీ అంత‌ర్మ‌థ‌నం చెందుతోంది.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈర‌న్న‌.. 2014లో మ‌డ‌క‌శిర నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కే టికెట్ ఇచ్చారు. కానీ, ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. వ‌యోవృద్ధుడు కావ‌డంతో ఇప్పుడు త‌న కుమారుడు సునీల్‌కు ఇవ్వాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. ఇటీవ‌ల సునీల్ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కూడాచేశారు. ఇదిలావుంటే.. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొని యాక్టివ్‌గా ఉంటున్న‌.. సుధీర్ అనే యువ నాయ‌కుడు కూడా త‌న‌కు టికెట్ కావాల‌ని పోరు పెడుతున్నారు.

వీరిద్ద‌రూ ఇలా ఉంటే.. మ‌రోవైపు.. గ‌త ఏడాది ప్రారంభంలో జ‌రిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో టీడీపీకి అనుకూలంగా చ‌క్రం తిప్పి.. ఒక సీటును వైసీపికి ద‌క్క‌కుండా చేసిన యూటీఎప్‌(యునైటెడ్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్) నాయ‌కుడు కూడా.. బ‌రిలో ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ఆయ‌న ఏకంగా నారా లోకేష్‌ను కలిసి త‌న ప్రొఫైల్‌ను అందించారు. తాను ఖ‌చ్చితంగా గెలుస్తాన‌ని.. టీచ‌ర్ల మ‌ద్ద‌త‌ను త‌న‌కే ఉంద‌ని ఆయ‌న చెబుతున్నారు.

దీంతో వీరిలో ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే విష‌యం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్ప‌టికే జిల్లాలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను నిర్ణ‌యించినా.. మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం విష‌యాన్ని మాత్రం పెండింగులో పెట్టారు. దీనిపై క్షేత్ర‌స్థాయిలో ఏకాభిప్రాయం సాధించాక నిర్ణ‌యం వెల్ల‌డించాల‌ని పార్టీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.