ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిదిలో నిర్వహించిన వైసీపీ సిద్దం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ నాయకులకు ఓటేసి.. పార్టీ అభ్యర్థులను అన్ని స్థానాల్లోనూ గెలిపించాలని ఆయన కోరారు. అయితే.. దీనికి కొంత మసాలా జోడించి చెప్పడమే ఆసక్తిగా మారింది. మీ కోసం నేను 57 నెలల కాలంలో వివిధ పథకాలకు సంబంధించి 124 సార్లు బటన్ నొక్కాను. మీరు నాకోసం ఒక్క బటన్ నొక్కండి! అని విన్నవించారు. అంతేకాదు.. వైసీపీకి ఓటేయకపోతే.. ఏం జరుగుతుందో కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పుడు మీరు నొక్కే బటన్.. వైసీపీని గెలిపించేందుకు మాత్రమే కాదు.. ఆ బటన్.. మీ భవిష్యత్తు కోసం. ఇప్పుడు మీకు అందుతున్న పథకాలు ఆగిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు అందుతున్న సంక్షేమం ఆగిపోకుండా ఉండడం కోసం.. ఇప్పు డు మీ ఇంటికే పింఛన్లు వస్తున్నాయి. ఇప్పుడు మీగడప వద్దకే వలంటీర్లు వస్తున్నారు. వైద్య, 104, 108 వంటివి ఇప్పుడు మీ ఇంటి ముందుకే వస్తున్నాయి. ఇవన్నీ ఆగిపోకుండా ఉండాలంటే.. మీరు ఒక్కసారి వైసీపీకి బటన్ నొక్కాలి అని జగన్ సిద్ధం సభలో ప్రజలకు పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. ఈ అవసరం.. ఒక్క వైసీపీకి మాత్రమే కాదని, సంక్షేమ పథకాలు ఇంటి వద్దే అందుకుంటున్న అవ్వ,తాత, అక్క, అన్న, వికలాంగులు అందరికీ ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమకు న్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వంలో తాము లబ్ధి పొందామని అనుకుంటేనే ఓటేయాలని.. అది కూడా వైసీపీకే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొందరు ఎన్నికల సమయంలో వచ్చి ఏవేవో చెబుతుంటారని.. కానీ, వారంతా ప్రవాసాంధ్రులని ఎద్దేవా చేశారు. ఇక్కడ వారికి ఇల్లు లేదని.. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పాలించాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు.
అలాంటి వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఓటు వేయకపోతే.. ఇంట్లోనే కూర్చుంటే..అది మీకే నష్టమని ఆయన తెలిపారు. ఇప్పటికి తాను 124 సార్లు బటన్ నొక్కి.. వివిధ సంక్షేమ పథకాలను అందించానని అన్నారు. డీబీటీ ద్వారా ఆయా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాయని, ఎలాంటివివక్ష, లంచాలు, అవినీతికి తావు లేకుండా ఆయా పథకాలను చేరువ చేసినట్టు సీఎం చెప్పారు. ఈ ఒక్కటీ మనసులో పెట్టుకోండి. మీ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్నీ ఆశీర్వదించండి అని జగన్ కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates