ఏపీ రాజధాని అమరావతికి మరో సారి అన్యాయం జరిగింది. ఇక్కడి రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర బడ్జెట్ లో అత్యంత హీనమైన కేటాయింపులు చేశారు. దీంతో ఇప్పుడు మరోసారి రాజదానికి అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదేసమయంలో ఏపీ ఎంపీ దుర్బల పనితీరు కూడా చర్చకు వస్తోంది. నవ నగరాల సమాహారంతో రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే రైతుల నుంచి 33 వేల ఎకరాల భూములను సమీకరించింది.
హైదరాబాద్‌లో ఎలా అయితే.. చిన్న చిన్న స్టేషన్‌లను కూడా అనుసందానం చేస్తూ.. రైల్వే లైన్ నిర్మించా రో.. ఇక్కడ అమరావతిలోనూ రాజధానిని రైల్వే లైన్‌తో అనుసంధానం చేయాలని అప్పట్లో సంకల్పించారు. అంటే.. అమరావతి – నంబూరు – పెదకూరపాడు – నరసరావుపేట – ఎర్రుపాలెంల మీదుగా కొత్తగా లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దీనికి గాను 2679 కోట్లు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేశారు.
ఈ మొత్తం రైల్వే లైను 106 కిలో మీటర్లు. ఇది.. కనుక అందిస్తే.. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మెట్రో రైలు లేదా.. లోకల్ రైలు నడపాలనేది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యం. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. అమరావతి అటకెక్కిన విషయం తెలిసిందే. ఇక, దీంతో పాటు.. అమరావతి రైలు ప్రాజెక్టు కూడా.. పూర్తిగా బుట్టదాఖలైనట్టేనని అంటున్నారు పరిశీలకులు. తాజాగా ప్రవేశ పెట్టింన మధ్యంతర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు అక్షరాల కేటాయించింది 1000 రూపాయలు మాత్రమే.
దీంతో ఈ పరిణామాన్ని.. అమరావతి రైతులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేసమయంలో 25 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమేనా? రాష్ట్రం గురించి ఎవరూ పట్టించుకోరా? అని నిలదీస్తున్నారు. ఈ పరిణామానికి కారణం.. రాష్ట్ర ప్రబుత్వం సరిగా స్పందించకపోవడమేనని సమాచారం. 22 మంది అధికార పార్టీ ఎంపీలు ఉండి ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు.