ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉన్న జగన్ వేరు, ఇప్పుడున్న జగన్ వేరని, ఈయన తన అన్న కాదని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వైఎస్ కుటుంబాన్ని ముక్కలు చేసింది కూడా జగనన్న అంటూ షర్మిల వ్యాఖ్యానించడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన షర్మిల….ప్రధాని మోడీ, ఎన్డీఏ ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు.
ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా హామీని మోడీ తుంగలో తొక్కారని, ఒక ఏడాది కూడా హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలో ఎన్నో హామీలు గుప్పించారని, ఒకటి కూడా పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలోని పార్టీలు బానిసలుగా మారాయని ఆరోపించారు. ఏపీ హక్కుల కోసం పోరాడుతోంది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, రాష్ట్ర హక్కులు సాధించే వరకు ఈ పోరాటం ఆగదని షర్మిల అన్నారు.
ఇదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కలిశానని, ఏపీకి బీజేపీ చేసిన మోసాలపై వివిధ పార్టీల అధినేతలకు లేఖలు రాస్తానని షర్మిల అన్నారు. అంతేకాదు, ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ లకు కూడా లేఖ రాస్తానని చెప్పారు. ఆలస్యమైనా ప్రజాస్వామ్యం గెలుపు తథ్యమన్నారు. ఏపీ విభజన హామీలను సాధించేవరకు తమ పోరాటం ఆగదని షర్మిల చెప్పారు. మరి, షర్మిల వ్యాఖ్యలపై బీజేపీ నేతల స్పందన ఏ విధంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.