టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి జనంలోకి రానున్నారు. ఈ నెల 5, 6 తేదీల నుంచి ఉత్తరాంధ్ర పర్యటనకు రెడీ అవుతున్నారు. శంఖారావం
పేరుతో ఆయన మూడు జిల్లాల్లో సభలకు సిద్ధమవుతున్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించను న్న ఆయన.. శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఇప్పటికే రాష్ట్రంలో ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రచారపర్వంలోనూ పార్టీ దూకుడుగా ఉంది. ఎట్టి పరిస్తితిలోనూ టీడీపీని గెలిపించుకోవా లన్న సంకల్పంతో ఉండడంతో నారా కుటుంబం మొత్తంగా రాజకీయ బాట పట్టింది. ఇదిలావుంటే.. ఇప్పుడు చేపట్టనున్న శంఖారావానికి ప్రత్యేక ఏంటంటే.. గత ఏడాది జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర కొంత గ్యాప్ వచ్చింది. అనివార్య కారణాలతో యువగళం పాదయాత్ర నిడివిని తగ్గించుకున్నారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన వాటిని వదిలేశారు.
ఈ నేపథ్యంలో యువగళం పాదయాత్ర కవర్ చేయని ప్రాంతాల్లో ఇప్పుడు శంఖారావం పేరుతో నారా లోకేష్ భారీ సభలు నిర్వహించాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఎంచుకున్నారు. ఈ సభల ద్వారా.. ప్రజలకు ఆయన చేరువకానున్నారు. ఈ నెల 5వ తేదీన ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నారా లోకేష్ శంఖారావం సభను ప్రారంభిస్తారు.
అనంతరం.. 6వ తేదీన పాలకొండ చేరుకుని, 7న పాలకొండ, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో సభలు పెడతారు. 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 9న చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 10న విజయనగరం, గజపతినగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో పర్యటించి.. సభల్లో పాల్గొననున్నారు. అదేవిధంగా. పార్టీ కార్యక్రమాలు..అభ్యర్థుల పనితీరును కూడా తెలుసుకోనున్నారు.