ఏపీలో రాజకీయాలు వడివడిగా మారుతున్నాయి. నాయకులు తమ తమ దారుల్లో స్పీడ్‌గానే మూవ్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్(భారత రాష్ట్రసమితి) ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం లేక పోవడం.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ.. తెలంగాణకే పరిమితం కావడం వంటివి తాజాగా బీఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
వాస్తవానికి ఏపీలో బీఆర్ఎస్ ఉంటే.. తోట చంద్రశేఖర్.. కాకినాడ లేదా.. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారి కావడంతో ఆయన ఈ ప్లాన్ వేసుకున్నారు. కానీ.. బీఆర్ఎస్ పోటీ నుంచి విరమించుకున్న దరిమిలా తోట.. తన రూటు మార్చుకున్నారు. జనసేన వైపు ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్ల నుంచి ఆయన జనసేనతో చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే.. దీనికి సంబంధించి అధికారికంగా ఏమీ బయటకు రాలేదు. మరోవైపు.. ఇదే బీఆర్ఎస్ కు చెందిన ఏపీ నాయకుడు రావెల కిశోర్‌బాబు.. తాజాగా వైసీపీలో చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు.
ఇక… ఇప్పుడు.. తోట నేరుగా పవన్ కళ్యాణ్ అన్న.. మెగా స్టార్ చిరును కలుసుకున్నారు. పద్మవిభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో మర్యాద పూర్వకంగా కలిశామని చెబుతున్నా.. రాజకీయంగా అంతర్గత చర్చ సాగినట్టు తెలుస్తోంది. తోట చంద్రశేఖర్ .. ఈ నెల 4న జనసేనలో చేరనున్నట్టు వార్తలు గుప్పు మంటున్నాయి. అదే రోజు మరో కాపు నేత.. వైసీపీ ఎంపీ బాలశౌరి కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇప్పటికే బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ టికెట్‌ను ఖరారు చేశారు.
ఇక, ఇప్పుడు తోటకు గుంటూరు వెస్ట్ సీటు ఖాయం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. గత 2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని మరి.. ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకుంది. టీడీపీ-జనసేన మిత్రపక్షం అభ్యర్థిగా ఇక్కడ నుంచి తోట నిలబడే చాన్స్ మెండుగా ఉందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. దీనికి తాజాగా చిరును ఆయన కలవడం.. అభినందించడం మరింత ప్రాధాన్యం కలిగించేలా చేసింది. ఏదేమైనా.. ఏపీలో మార్పులు జోరుగానే సాగుతున్నాయి.