తేలిపోయింది.. నిన్న మొన్నటి వరకు తెరచాటున ఊగిసలాడిన కీలక నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు ముసుగు తీసేశారు. పైకి ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. తాను వైసీపీకి దూరమవుతున్నాననే సంకేతాలను స్పష్టంగా పంపించేశారు. దీంతో వైసీపీ కూడా అలెర్ట్ అయిపోయింది. ఆ నియోజకవర్గమే ఉమ్మడి కృష్నాజిల్లాలోని మైలవరం. ఇది టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు ఈయన కూడా టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన నాయకుడే కావడం గమనార్హం.
ఇక, ఇప్పుడు.. ఆయనను మార్చుతున్నారనే వాదన ఒక వైపు వినిపిస్తున్నా.. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేక భావన పెరిగిందన్నది వసంత చెబుతున్న మాట. ఇటీవల కూడా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. “సంక్షేమం అమలు చేస్తున్నారు బాగానే ఉంది. కానీ, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. దీనికి మా దగ్గర సమాధానం లేదు. ప్రజల అభిరుచి మేరకు వారు కోరుకున్నది చేయడం లేదు. అందుకే ప్రజలు కొంత ఆలోచనలో పడ్డారు” అని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. ఆయన పార్టీకి గుడ్ బై చెబుతారని.. కొన్నాళ్లుగా ప్రచారంలోనే ఉంది. ఇక, ఇప్పుడు అది ద్రుఢ పడింది.
ఇప్పుడు ఏం జరిగింది?
సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీని సమాయత్తం చేస్తున్నారు. సిద్ధం పేరుతో ఇప్పటికే ఆయన విశాకలోని భీమిలి నియోజకవర్గంలో సభను ఏర్పాటు చేశారు. ఎన్నికలకు తాము సిద్ధమని..ఎవరు ఎటు నుంచి ఎంత మంది వచ్చినా..ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ఇక, ఈ సభకు కొనసాగింపుగా ఏలూరులో శుక్రవారం(ఫిబ్రవరి 2) సిద్ధం సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని సమీప నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పార్టీఆదేశించింది. వీరిలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఉన్నారు. ఆయనను కూడా నియోజకవర్గం నుంచి 10 వేల మంది ప్రజలను సభకు తరలించాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి.
అయితే.. మైలవరం ఎమ్మెల్యే వసంత అధిష్టానం చెప్పినట్టు చేసేది లేదని భీష్మించారు. తాను సహకరించేది లేదని.. ఆయన నేరుగా ఎంపీ కేశినేని నానికే చెప్పేశారు. అంతేకాదు.. నియోజకవర్గంలోనూ అందుబాటులో లేకుండా హైదరాబాద్ వెళ్లిపోయారని అనుచరులు చెబుతున్నారు. కానీ, ఆయన కార్యాలయం మాత్రం బెంగళూరుకు వెళ్లారని అంటోంది. ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. దీంతో వ్యూహం పసిగట్టిన వైసీపీ అధిష్టానం.. ఎమ్మెల్యే విషయాన్ని తాము చూసుకుంటామని.. జన సమీకరణను మీరు చూసుకోవాలని ఎంపీ నాని.. సహా నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌కు బాధ్యతలు అప్పగించేసింది. దీంతో వారు సిద్ధం ఏలూరు సభకు మైలవరం నుంచి జనాలను తరలించే పనిలో పడ్డారు. మొత్తానికి ఈ పరిణామాలను గమనిస్తే.. మైలవరం సీటు ఖాళీ కానుందని స్పష్టంగా తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates