ఏపీ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానం ఏంటి? వచ్చే ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ ఎలా ముందుకు సాగుతుంది? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పొత్తులు పెట్టుకుని టీడీపీ-జనసేన ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఈ పొత్తుకు బీజేపీ కూడా కలిసి వస్తే.. తమకు తిరుగు ఉండదని.. 175 లో 160 స్తానాలు దక్కించుకుంటామని మిత్రపక్షం అంచనా వేస్తోంది. కానీ, బీజేపీ మాత్రం దీనిపై స్పందించడం లేదు. ఇక, రాష్ట్ర నేతలు.. కూడా కేంద్రంలోని పెద్దలు చూసుకుంటారని అంటున్నారు.
అయితే.. ప్రస్తుతం బీజేపీ.. జనసేనతో పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ, ఆయన బీజేపీకి చెప్పకుండా.. వారి నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాకుండా..ఇలా చేయరనేది బీజేపీ రాష్ట్ర నేతల్లో వినిపిస్తున్న టాక్. ఈ నేపథ్యంలో బీజేపీ సానుకూలం గానే స్పందించే అవకాశం ఉందని.. తమతోనే నడుస్తుందని.. మిత్రపక్షం భావిస్తోంది. అందుకే.. సీట్ల కేటాయింపు విషయాన్ని కూడా తాత్సారం చేస్తున్నారనేది చర్చ.
ఇక, ఇప్పుడు ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన వ్యూహం ఎన్నికలనేనని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ సహకారం కోసం ఆయన అభ్యర్థించనున్నారు. దీనికి బీజేపీ పెద్దలు ఏం చేస్తారనేది కీలకం. వారికి ఇప్పటి వరకు ఇతర విషయాల్లో సహకరిస్తున్నందున.. జగన్‌కు అనుకూలంగా చక్రం తిప్పుతారా? తెరచాటున మేముంటాం.. మీరు మీరు చూసుకోండి.. అనిహామీ ఇస్తారా? అనేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
ఒకవేళ.. బీజేపీ ఇలా చేస్తే.. పార్టీపరంగా మరింత నష్టపోయే అవకాశం ఉంటుందని బీజేపీ రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. ‘ఏదో ఒకటి తేల్చేయాలి. ఈ గట్టా.. ఆ గట్టా!. ఎందుకీ నాన్చుడు. మధ్యలో మాలాంటి వాళ్లకు ఇబ్బందిగా మారుతోంది’ అని ఉత్తరాంధ్రకు చెందిన ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. పైగా.. ఇలా చేయడం వల్ల.. ఏపార్టీకీ ప్రయోజనం ఉండదని కూడా.. అంటున్నారు. సో.. ఇప్పుడు బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుంది? ఇటు పొత్తులకు సిద్ధపడుతుందా? లేక.. జగన్‌కు సహకరిస్తుందా? ఇవన్నీ కాక.. అటు పొత్తు.. ఇటు సహకారం రెండూ ఉంటాయా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates