బిహార్ అయిపోయింది.. ఇక‌, జార్ఖండ్‌.. ఈడీ ఎంట్రీ!

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం క‌న్నేసిన రాష్ట్రం క‌మ‌లం గూటికి చేరుతున్న విష‌యం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. తాము కోరుకున్న రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు ఏదో ఒక దారి వెతు క్కుంటారని, లేకుంటే.. ఈడీ, సీబీఐ వంటివాటిని ప్ర‌యోగిస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు చెప్ప‌డ‌మూ తెలిసిందే. ఇప్పుడు తాజాగా బిహార్‌లోనూ బీజేపీ ఇదే ఫార్ములాను ప్ర‌యోగించింది. దీంతో ఇక్క‌డ నితీష్ కుమార్ మ‌హాఘ‌ట్‌బంధ‌న్‌తో రాం రాం చెప్ప‌డం..ఆవెంట‌నే క‌మ‌లంతో చేతులు క‌ల‌ప‌డం తెలిసిందే. దీంతో బిహార్‌లో బీజేపీ స‌ర్కారు ఏర్ప‌డిపోయింది.

ఇక‌, ఇప్పుడు బీజేపీ జార్ఖండ్‌పై దూకుడు పెంచింది. వాస్త‌వానికి ఈ రాష్ట్రంపై బీజేపీ ఎప్పుడో క‌న్నేసింది. గ‌నులు.. ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాల‌నేది క‌మ‌ల నాథుల ప్లాన్‌. కానీ, ఇక్క‌డి అధికార పార్టీ.. జార్ఖండ్ ముక్తిమోర్చా మాత్రం కాంగ్రెస్‌తో జ‌ట్టుక‌ట్టి పాల‌న సాగిస్తోంది. యువ సీఎం.. హేమంత్ సొరేన్ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని హ‌స్తంతో చేతులు క‌లిపి ముందుకు సాగుతున్నారు. అయితే.. సొరేన్‌కు గ‌తంలోనే బీజేపీ ఆఫ‌ర్ ఇచ్చింది. క‌లిసి పాలిద్దాం అనిచెప్పింది.

అయితే..ఆయ‌న వినిపించుకోలేదు. కాంగ్రెస్‌తోనే చెలిమి చేస్తున్నారు. బీజేపీపై దూకుడు విమ‌ర్శ‌లు త‌గ్గించినా.. పొత్తుకు మాత్రం ఒప్పుకోవ‌డం లేదు. దీంతో కొన్నాళ్లుగా ఈడీ సీఎం హేమంత్‌పై కేసులు న‌మోదు చేయ‌డం.. నోటీసులు జారీ చేయ‌డం తెలిసిందే. తాజాగా ఇప్పుడు హేమంత్ ఇంటికే వెళ్లిన ఈడీ అధికారులు ఆయ‌న ఇంటి త‌లుపు త‌ట్టారు. భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మనీల్యాండరింగ్ కోణంలో ప్రశ్నించేందుకు తొమ్మిది సార్లు నోటీసులు పంపించినా రాలేద‌ని పేర్కొంటూ.. ఆయ‌న ఇంటికే వెళ్ల‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

స‌హ‌జంగా సీఎం ఇంటికి ఈడీ వెళ్ల‌దు. కానీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం పదవితో పాటు జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కింద‌టే సమన్లు జారీ చేసిన ఈడీ మనీలాండరింగ్ కేసులో జనవరి 29 లేదా జనవరి 31న విచారణను ధృవీకరించాలని కోరింది. అయితే హేమంత్ స్పందించ‌లేదు. ఇదిలావుంటే.. కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నికలు.. ఈ ఏడాదే జ‌ర‌గ‌నున్న జార్ఖండ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇలా చేయ‌డం ప‌ట్ల‌ బీజేపీపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.