ఐఆర్ఆర్ కేసులో చంద్ర‌బాబు బిగ్ రిలీఫ్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ ల‌భించింది. ఆయ‌న‌పై ఏపీ ప్ర‌భుత్వం పెట్టిన అమరావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్ కేసు విష‌యంలో చంద్ర‌బాబుకు ల‌భించిన ముంద‌స్తు బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఈ కేసులోనూ 17ఏ(రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వులు అనుభ‌వించిన లేదా ఉన్న వారి అరెస్టు విష‌యంలో గ‌వ‌ర్న‌ర్‌కు చెప్పాల‌న్న/ అనుమ‌తి తీసుకోవాల‌న్న‌ నిబంధ‌న‌) వ‌ర్తించేలా ఉంద‌ని పేర్కొంది.

ఏపీలో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యించిన త‌ర్వాత‌.. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేప‌ట్టేందుకు చంద్ర బాబు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. దీనికి సంబంధించి ప‌క్కా ప్ర‌ణాళిక కూడా సిద్ధం చేసింది. ఇంత‌లో ఎన్నిక‌లు రావ‌డంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స్థానంలో వైసీపీ వ‌చ్చింది. త‌ర్వాత‌.. రాజ‌ధానిపై శీత‌క‌న్నేసిం ది. ఇక‌, వివిధ కార్య‌క్ర‌మాల్లో అవినీతి జ‌రిగిందంటూ.. వైసీపీ సర్కారు చెబుతూ వ‌చ్చింది. గ‌త ఏడాది ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు విస్త‌ర‌ణ‌, కుదింపు వ్య‌వ‌హారంలో అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ్డార‌ని పేర్కొంటూ.. మాజీ సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కులు పొంగూరు నారాయ‌ణ‌పై సీఐడీ కేసులు న‌మోదు చేసింది.

అరెస్టు చేయ‌కుండా నారాయ‌ణ ఇప్ప‌టికే బెయిల్ తెచ్చుకున్నారు. ఇక‌, చంద్ర‌బాబును రాజ‌మండ్రి జైల్లో ఉంచిన‌ప్పుడు.. ఈ కేసులోనూ ఆయ‌నను అరెస్టు చేయాల‌ని సీఐడీ పోలీసులు భావించారు. కానీ, ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కోరుతూ..ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిని సుదీర్ఘంగా విచారించిన ఏపీ హైకోర్టు.. చంద్ర‌బాబుకు ముంద‌స్తు బెయిల్ ఇచ్చింది. అయితే, విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని మాత్రం సూచించింది.

ఇదిలావుంటే.. ఇలా బెయిల్ ఎలా ఇస్తారంటూ..ఏపీ సీఐడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపైనా సుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగాయి. ఎట్టకేల‌కు తాజాగా ఇచ్చిన తీర్పులో ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఆయ‌న‌కు నోటీసులు అయినా.. జారీ చేయాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఇత‌ర కేసుల్లో 17 ఏ వ‌ర్తిస్తే.. దీనికి కూడా వ‌ర్తిస్తుంద‌ని వ్యాఖ్యానించింది.