కేటీయార్ కు సిరిసిల్ల షాక్

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ముఖ్యనేతలకు కష్టాలు మొదలైపోయాయి. రిజల్ట్సు వచ్చిన రెండోరోజే బాత్ రూమ్ లో జారిపడటంతో కేసీయార్ తుంటిఎముక విరిగింది. దానికి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకనే పార్టీ వ్యవహారాలను డైరెక్టుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ తన చేతిలోకి తీసుకున్నారు. అయితే ఓటమి తాలూకు ప్రభావం కేటీయార్ నిర్వహిస్తున్న సమీక్షల్లో స్పష్టంగా తెలిసిపోతోంది. ఓటమికి పార్టీ ముఖ్యనేతలే కారణమని చాలామంది ద్వితీయ శ్రేణి నేతలు మొహంమీదే చెప్పేస్తున్నారు.

ఒకరకంగా సమీక్షా సమావేశాలు కేటీయార్ ను ఇబ్బందిపెడుతున్నట్లే అనుకోవాలి. సరిగ్గా ఇదే సమయంలో కేటీయార్ కు షాక్ కొట్టే వ్యవహారం ఒకటి తెరమీదకు వచ్చింది. అదేమిటంటే తాను ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటి ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం. ఛైర్మన్ వైఖరితో విసిగిపోయిన కౌన్సిలర్లు చాలాకాలంగా కేటీయార్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదట. ఇపుడు అధికారం మారిపోయింది కదా అందుకనే చాలా చోట్ల బీఆర్ఎస్ ఛైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టి దింపేస్తున్నారు.

ఇందులో భాగంగానే సిరిసిల్ల ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైపోయిందట. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై 12 మంది కౌన్సిలర్లు సంతకాలు పెట్టేసి క్యాంపుకు వెళ్ళిపోయారట. క్యాంపుకు ఎందుకు వెళ్ళారంటే సోమవారం కేటీయార్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అందుకనే ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తు సంతకాలు చేసి అందుబాటులో లేకుండా క్యాంపుకు వెళ్ళిపోయారు. మిగిలిన 8 మంది కౌన్సిలర్లు కూడా సంతకాలు చేయగానే క్యాంపుకు వెళ్ళిపోవాలని సిద్ధంగా ఉన్నారట.

అవిశ్వాస తీర్మానం ద్వారా ఛైర్మన్ను దించేయటం కోసం కౌన్సిలర్లందరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అయిపోయారట. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన, ఓటింగ్ విషయంలో బీఆర్ఎస్ విప్ జారీచేస్తున్న ఎవరు లెక్కకూడా చేయటంలేదని సమాచారం. ఇప్పటికే 12 మున్సిపాలిటీల్లో ఛైర్మన్లను దింపేశారు. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న మున్సిపాలిటీల్లో ఒక్కోటి కాంగ్రెస్ ఖాతాలో జమవుతున్నాయి. క్షేత్రస్ధాయిలో బీఆర్ఎస్ బలం ఎలా పెంచుకున్నదో అదే పద్దతిలో తరగిపోతోందని అర్ధమవుతోంది.