రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో టికెట్ ను జేసీ బ్రదర్స్ పట్టుబట్టి సాధించుకున్నారు. మాజీ ఎంఎల్ఏ, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డికి చంద్రబాబునాయుడు తాడిపత్రి టికెట్ కన్ఫర్మ్ చేశారని సమాచారం. జేసీ బ్రదర్స్ తో చాలాసేపు చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే తాడపత్రి టికెట్ అస్మిత్ రెడ్డికి ఓకే అయ్యింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కొడుకు జేసీ వపన్ రెడ్డికి కల్యాణదుర్గం టికెట్ ను మాత్రం చంద్రబాబు కుదరదని చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.
కల్యాణదుర్గంలో తన కొడుకు పవన్ రెడ్డిని పోటీచేయించాలని దివాకరరెడ్డి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు అనంతపురం ఎంపీగానే పోటీచేయించాలని అనుకున్నా తర్వాత ఎందుకో కల్యాణదుర్గంపై దృష్టిపెట్టారు. అయితే ఇద్దరికి టికెట్లు ఇవ్వటానికి చంద్రబాబు అంగీకరించలేదు. పోయిన ఎన్నికల్లో పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా, అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎంఎల్ఏగా పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.
అప్పట్లో ఓడిపోయిన అస్మిత్ తాడిపత్రి మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగూ తండ్రి ప్రభాకరరెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్నారు కాబట్టి రెగ్యులర్ గా బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఇదే సమయంలో అనంతపురంలో ఓడిపోయిన పవన్ రెడ్డి స్ధిరంగా లేరు. ఒకసారి ఒక నియోజకవర్గమని మరోసారి ఇంకో నియోజకవర్గమని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో జేసీ బ్రదర్స్ తో జిల్లాలోని చాలామంది నేతలకు ఏమాత్రం పడదు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ 8 నియోజకవర్గాల్లో తన మద్దతుదారులకే టికెట్లు ఇప్పించుకోవాలని బ్రదర్స్ చాలా ప్రయత్నాలు చేశారు.
అయితే ఆయా నియోజకవర్గాల్లోని మాజీమంత్రులు లేదా మాజీ ఎంఎల్ఏలు జేసీ బ్రదర్స్ ను అంతే ధీటుగా వ్యతిరేకించారు. దాంతో క్షేత్రస్ధాయిలో వ్యవహారాలపై రిపోర్టు తెప్పించుకున్న చంద్రబాబు బ్రదర్స్ ను రాబోయే ఎన్నికల్లో తాడిపత్రికి మాత్రమే పరిమితం అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే బ్రదర్స్ రెండుసీట్లకు పట్టుబట్టినా చంద్రబాబు మాత్రం ఒక్కసీటునే కేటాయించారు. మరిపుడు పవన్ రెడ్డి ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates