ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తన దూకుడు ఏమా త్రం కూడా తగ్గించడం లేదు. వైసీపీపైనా.. సీఎం జగన్ సర్కారుపైనా ఆమె విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని విజయవాడలోని పార్టీ ఆఫీస్ ఆంధ్ర రత్న భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల సీఎం జగన్ విజయవాడలో ఆవిష్కరించిన డాక్టర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విగ్రహాలు పెడితే కడుపు నిండదని మండిపడ్డారు.
“అంబేద్కర్ అన్ని వర్గాల వారికి అభ్యున్నతి కోసం రాజ్యాంగం రాశారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో జగనన్న ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటున్నాయి.. అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదు., దళితులపై జరుగుతున్న దాడులు ఆగవు. వారి శోకం తీరదు. వారిని పట్టించుకుని, రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడు మాత్రమే వారికి మేలు జరుగుతుంది. కానీ, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు” అని షర్మిల అన్నారు.
అంతేకాదు.. దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకున్నారని.. సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. ఒక దళితుడు ఎదిరించాడని ఆయనకు గుండు గీసి అవమానించారని దుయ్యబట్టారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం ఎవరైనా చెబుతారని, కానీ అధికారంలో ఉన్నవారు ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
దళితుల పట్ల, ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్ల కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు వైఎస్ షర్మిల ఈ సందర్భంగా పిలుఉనిచ్చారు. ఎవరు ఎస్సీ , ఎస్టీలకు మేలు చేశారో గుర్తించాలన్నారు. వైఎస్సార్ హయాంలో దళితులపై దాడులు జరగలేదన్నారు. ఆయన హయాంలోనే ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు వచ్చిందన్నారు. కానీ, ఈ రోజు ఆయన పేరు చెప్పుకొని కొందరు దళితులను వంచిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates