టార్గెట్ ష‌ర్మిల‌.. ఒక్కొక్క‌రు ఒక్కో లైన్‌లో !

ఏపీ అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తున్న ష‌ర్మిల‌కు అదే రేంజ్‌లో రివ‌ర్స్ టార్గెట్ ఎదుర‌వుతోంది. నిజానికి ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన ష‌ర్మిల తొలిరోజే వైసీపీని టార్గెట్ చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా సీఎం జ‌గ‌న్‌ను కూడా ఏకేయ‌డం ప్రారంభించారు. ప్ర‌ధానంగా హోదా స‌హా బీజేపీతో అంట‌కాగుతున్నార‌న్న విమ‌ర్శ‌ల‌తో జోరు పెంచారు. ఇవి ఓ వ‌ర్గం మీడియాలో ప‌తాక స్థాయి వార్త‌లుగా వ‌చ్చాయి. దీంతో వైసీపీ కూడా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది.

ఈ నేప‌థ్యంలో రెండు రోజులు ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌ను చూసీ చూడ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన వైసీపీ.. త‌ర్వాత రోజు నుంచి నేత‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అంతే.. ఒక్కొక్క‌రుగా విరుచుకుప‌డ‌డ‌డం ప్రారంభించా రు. ఒక‌ప్పుడు ష‌ర్మిల గురించి మాట్లాడేందుకు త‌న‌కు ధైర్యం లేద‌న్న ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇటీవ‌ల స‌వాళ్లే విసిరారు. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ష‌ర్మిల‌ను సైతం ఓడిస్తామ‌న్నారు. డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌ని చెప్పారు.

ఇక‌, తాజాగా మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాపం.. ష‌ర్మిల‌ను చూస్తే.. జాలేస్తోంది! అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. “షర్మిల మాటలు చూసి జాలేస్తోంది. షర్మిల మాటల్లో కొత్తదనం లేదు. ఎవ‌రో రాసిచ్చిన స్క్రిప్టును ఆమె కొంత ఆవేశంతో చ‌దువుతున్నారు. అంతే త‌ప్ప‌.. ఆమె ప్ర‌త్యేకంగా మాట్లాడేది ఏమీ క‌నిపించ‌డం లేదు” అని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. ప్ర‌త్యేక హోదా గురించి అడ‌గాల్సి వ‌స్తే.. ముందు కాంగ్రెస్ పార్టీనే ప్ర‌శ్నించాల‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఎందుకు పెట్ట‌లేదో ఆ పార్టీనే చెప్పాల‌న్నారు.

మ‌రోవైపు.. మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇదే రేంజ్‌లో మాట‌ల తూటాలు పేల్చారు. “ఆమె కొన్ని రోజులు ఆడ పిల్ల అంటుంది.. మ‌ళ్లీ ఇప్పుడు ఈడ పిల్ల‌ని అంటుంది. ఆమెకే క్లారిటీ లేదు. హైద‌రాబాద్‌లో పుట్టాన‌ని చెబుతుంది. మ‌ళ్లీ జ‌మ్మ‌ల‌మ‌డుగులో పుట్టాన‌ని అంటుంది. క్లారిటీ ఉందా? ఆమెకు.. కేఏ పాల్‌కు పెద్ద‌గా తేడాలేదు. వీళ్లంతా టైంపాస్ నాయ‌కులు” అని పేర్ని తేల్చేశారు. ష‌ర్మిల కేవ‌లం కాంగ్రెస్ పార్టీ కోస‌మే రాలేద‌ని.. మ‌రో పార్టీ కోసం వ‌చ్చింద‌ని అన్నారు. మొత్తంగా చూస్తే.. ష‌ర్మిలపై ఒక్కొక్క‌రు ఒక్కొక్క లైన్‌లో ఏకేస్తున్నారు.