జగన్ వ్యాఖ్యల ఆంతర్యమేమి? 

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన  అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 60-70 రోజుల్లోనే ఎన్నికలు ఉండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపోటముల గురించి చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇండియా టుడే సమ్మింట్లో ఆయన ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో బిట్స్ కొన్ని ఇప్పటికే వైరల్ కాగా.. అందులో ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది.

తాను ఇచ్చిన హామీల్లో దాదాపుగా అన్నీ నెరవేర్చానని.. కాబట్టి ఇప్పుడు తాను ఓడిపోయినా చింత లేదని..  తానెంతో సంతోషంగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు ఏపీ సీఎం.

ఈ వ్యాఖ్యలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేసీఆర్ కామెంట్లతో పోల్చి చూస్తున్నారు విశ్లేషకులు. కేసీఆర్ గతంలో మాదిరి ఈ ఎన్నికల ముందు కాన్ఫిడెంట్‌గా, అగ్రెసివ్‌గా మాట్లాడలేదు. ఓడితే మీకే నష్టం, నాదేముంది, అన్నీ సాధించా, హాయిగా ఉంటా.. అంటూ ఆయన వైరాగ్యంతో మాట్లాడారు. నెగెటివ్ సెన్స్ వచ్చేలా ఉన్న ఆ వ్యాఖ్యలు చూసి కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని, ఈ విషయం ఆయనకూ అర్థం అయిపోయిందనే చర్చ జరిగింది.

ఇప్పుడు జగన్ ఓడినా బాధ లేదు అనే మాట మాట్లాడడంతో ఆయనకు రియాలిటీ అర్థమయ్యే ఈ మాట మాట్లాడారా అనే  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి మాటలు క్యాడర్‌కు, జనాలకు వేరే సంకేతాలు ఇస్తాయని.. గెలుస్తామన్న ధీమా ఉన్న వాళ్లు ఇలా మాట్లాడరని సోషల్ మీడియా జనాలు చర్చించుకుంటున్నారు.