రాజ‌కీయాల‌కు గ‌ల్లా దూరం.. 28న ఏం జరుగుతుంది?

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, టీడీపీ నాయ‌కుడు, గుంటూరు పార్ల‌మెంటు స‌భ్యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ రాజ‌కీయా ల‌కు దూరం కానున్న‌ట్టు తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నార‌ని కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అసలు ఆయ‌న పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. తాజాగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు కూడా జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే గ‌ల్లా జ‌య‌దేవ్ మాతృమూర్తి, మాజీ మంత్రి గ‌ల్లా అరుణ కుమార్ కొన్నాళ్ల కింద‌టే పూర్తిగా రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు.అనారోగ్య కార‌ణాల‌తో ఆమె రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లోప‌నిచేసిన గ‌ల్లా కుటుంబం రాష్ట్ర విభ‌జ‌న‌తో టీడీపీలోకి వ‌చ్చారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి అరుణ‌, గుంటూరు పార్ల‌మెంటు స్థానం నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్‌లు 2014లో పోటీ చేశారు. అరుణ ఓడిపోగా.. జ‌య‌దేవ్ విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఆ త‌ర్వాత‌.. అరుణ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. కానీ, జ‌య‌దేవ్ 2019లో గుంటూరు నుంచి మ‌రోసారిపోటీ చేసి విజ‌యంద‌క్కించుకున్నారు. అయితే.. రాజ‌కీయాల్లో ఉన్న కార‌ణంగా త‌న వ్యాపారాల‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని.. అధికారులు స‌హ‌క‌రించ‌డం లేద‌ని.. కొన్నాళ్లుగా ఆయ‌న అసంతృప్తితో ఉన్నారు. పైగా ఏపీ నుంచి కొంత వ్యాపారాన్ని తెలంగాణకు కూడా త‌ర‌లించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది.

28న జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు టిడిపి నేతల తో భేటీ కావాల‌ని గ‌ల్లా నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఓ ప్రవేట్ కళ్యాణ మంటపం టిడిపి నేతలకు ఆత్మీయ విందు ఇవ్వ‌నున్నారు. త‌న రాజ‌కీయాల నిర్ణ‌యాన్ని ఇప్పటికే టిడిపి అధిష్టానానికి గ‌ల్లా తెలియ‌జేశారు. కాగా 28నాటి స‌మావేశంలో రెండు సార్లు తనని గెలిపించిన వారికి ధన్యవాదాలు తెల‌ప‌నున్న‌ట్టు గ‌ల్లా అనుచ‌రులు తెలిపారు. దీనికి సంబంధించి గ‌ల్లా వ‌ర్గం భారీగా ఏర్పాట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.