కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోగానే వైఎస్ షర్మిల ఆపరేషన్ ఆపర్ష్ మొదలు పెట్టినట్లున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత, రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేసిన మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరారు. అహ్మదుల్లా 2004, 2009లో కాంగ్రెస్ తరపున కడప ఎంఎల్ఏగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్సార్ మరణంతో అహ్మదుల్లా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినా పెద్దగా యాక్టివ్ గా లేరు. ఎన్నికల తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కడప పట్టణంలోని ముస్లిం మైనారిటిల్లో అహ్మదుల్లాకు మంచి పట్టుంది. అలాంటి అహ్మదుల్లా సడెన్ గా కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో ఉన్న చనువు కొద్ది షర్మిల ఫోన్లో మాట్లాడినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తానని షర్మిల హామీ ఇచ్చారట. అందుకనే అహ్మదుల్లా మళ్ళీ యాక్టివ్ అవటానికి అంగీకరించినట్లు సమాచారం.
కడపలో షర్మిల పర్యటనలో మాజీ మంత్రి పాల్గొన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థిగా కడప అసెంబ్లీకి అహ్మదుల్లా పోటీ ఖాయమైనట్లే. సడెన్ డెవలప్మెంట్ వల్ల రాజకీయ సమీకరణలు మారిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. ఇప్పటిరవకు వైసీపీ-టీడీపీ+జనసేన మధ్యనే పోటీ ఉంటుందని అనుకుంటున్నారు. అలాంటిది అహ్మదుల్లా ఎంట్రీతో రెండుపార్టీల్లోను అయోమయం మొదలైంది. గడచిన రెండు ఎన్నికల్లో వైసీపీ తరఫున అంజాద్ భాషా గెలిచారు. ఇపుడు అంజాద్ ఉపముఖ్యమంత్రి కూడా. ఈయన గెలుపులో ముస్లిం ఓటర్లే కీలకంగా ఉన్నారు.
రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తమకే పడతాయని టీడీపీ, జనసేన నేతలు అనుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో అహ్మదుల్లా ఎంట్రీ కారణంగా ముస్లిం ఓటర్లలో చీలిక వస్తే వైసీపీకి ఇబ్బంది. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికతో టీడీపీ, జనసేనకు నష్టం. ఏ పార్టీకి ఎంత నష్టమో తేలాలంటే అహ్మదుల్లా చీల్చుకునే ఓట్లపైనే ఆధారపడుంటుంది. అది తేలాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా అహ్మదుల్లా ఎంట్రీతో రెండు పార్టీల్లోను టెన్షనయితే మొదలైంది. మరి మిగిలిన నియోజకవర్గాల్లో షర్మిల ఏమి చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates