టీడీపీ-జనసేన మొదటిజాబితా విడుదల ఆలస్యమయ్యేట్లుంది. సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే మొదటిజాబితాను విడుదల చేయాలని చంద్రబాబునాయుడు అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల జాబితా విడుదల ఆలస్యమయ్యేట్లుంది. దీనికి కారణం ఏమిటంటే రెండుపార్టీలతో కలిసే విషయంలో బీజేపీ ఏ సంగతి తేల్చి చెప్పకపోవటం. సీట్లు ఫైనల్ చేసి జాబితాను విడుదల చేసిన తర్వాత మళ్ళీ మార్పులు చేయాల్సొస్తే అది నెగిటివ్ ప్రభావం చూపుతుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనుకున్నారట.
అలాగే రెండు పార్టీలు పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, జనసేనకు కేటాయించాల్సిన సీట్ల సంఖ్యపై చంద్రబాబు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తమ్ముళ్ళ టాక్. సంక్రాంతి పండుగ అయిపోగానే 70 మందితో మొదటి జాబితాను విడుదల చేయాలని అనుకున్నారు. ఇందులో టీడీపీ తరపున 50 నియోజకవర్గాలు, మిగిలిన 20 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులుంటారని మొదట అనుకున్నారు. అయితే పై కారణాల వల్ల జాబితా రిలీజులో లేటవుతోందట. టీడీపీ జాబితాలో సిట్టింగు ఎంఎల్ఏలకే టాప్ ప్రయారిటి ఉండబోతోందని సమాచారం.
ఇక్కడ సమస్య ఏమిటంటే బీజేపీ తమతో చేతులు కలుపుతుందో లేదో తెలియాలంటే ఎంతకాలం ఆగాలో చంద్రబాబు, పవన్ కు అర్ధంకావటంలేదు. ఒకవైపేమో ఒంటరిపోటీకే నిర్ణయించుకుని బీజేపీ అభ్యర్ధుల జాబితా రెడీ చేసుకుంటోంది. అన్నీ నియోజకవర్గాల్లో ఆశావహులతో ప్రాబబుల్స్ లిస్టు రెడీ చేయమని జాతీయ నాయకత్వం నుండి సమాచారం అందింది. దాని ప్రకారమే జిల్లాలకు ముగ్గురు పరిశీలకులతో కమిటీలను నియమించారు. ఆ కమిటీలు తమ పనిని అవి చేసుకుపోతున్నాయి. ఈ నేపధ్యంలో తమతో బీజేపీ కలిసి వస్తుందో రాదో కూడా తేల్చుకోలేకపోతున్నారు.
బీజేపీ కోసం వెయిట్ చేయటం వల్ల తమకు సమస్యలు పెరుగుతాయనే ఆందోళన కూడా పెరిగిపోతోంది. ఇదే సమయంలో వైసీపీలో టికెట్లు దొరకని అసంతృప్తులు టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. మరి వీళ్ళని ఎక్కడ సర్దుబాటుచేయాలో కూడా అర్ధంకావటంలేదు. ఇన్ని గందరగోళాల మధ్య అరకు అసెంబ్లీ అభ్యర్ధిగా సివేరి దొన్నుదొరను చంద్రబాబు ప్రకటించారు. దొన్నుదొర టికెట్టే అధికారికంగా ప్రకటించిన మొదటిపేరుగా చూడాలి. మరి జాబితా ఆలస్యమంటే ఎప్పటికి రెడీ అవుతుందో ? ఎప్పటికి ప్రకటిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates