రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కోటి కష్టాలు తప్పదులాగుంది. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావటమే టార్గెట్ గా సిక్స్ గ్యారెంటీస్ పదేపదే ప్రచారం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారెంటీస్ కూడా కీలకమనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సిక్స్ గ్యారెంటీస్ అమలుచేస్తామని ఇచ్చిన హామీలే ఇపుడు పార్టీ కొంపముంచేట్లుగా ఉంది. వందరోజుల్లోనే అమలు చేయాలంటే సాధ్యంకావటంలేదు. అలాగని అమలుచేయలేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కష్టాలు తప్పవు. అందుకనే సినిమా డైలాగులాగ కనిపించీ కనిపించుండా, వినిపించీ వినబడకుండా అన్నట్లు అమలు చేసీ చేయనట్లే ఉండాలని అనుకుంటున్నది.
ఇపుడు విషయం ఏమిటంటే ఏ పథకాన్ని తీసుకున్న లబ్దిదారుల సంఖ్య కోటి దాటిందట. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాదర్బార్ లో అభయహస్తం లబ్దికోసం వచ్చిన దరఖాస్తులు కోటి. రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ కార్డుల సంఖ్య సుమారు 90 లక్షలున్నాయి. కార్డుల కోసం పెండింగులో ఉన్న దరఖాస్తులు మరో 15 లక్షలున్నాయి. వీటిని సార్టవుట్ చేస్తే రేషన్ కార్డుల సంఖ్య కూడా కోటి దాటడం ఖాయం. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ వాడకం ఫ్రీ. ఫ్రీ కరెంటు కోసం అందిన దరఖాస్తులు కూడా కోటి దాటాయి.
ప్రతినెలా రు. 2500 ఆర్ధికసాయం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల సంఖ్య కూడా కోటి దాటాయని సమాచారం. రైతుబంధు అందుకుంటున్న వారికి అదనంగా రైతుభరోసా కింద కౌలు రైతులు, రైతు కూలీలను చేర్చబోతున్నారు. దాంతో వీళ్ళ సంఖ్య కూడా కోటి దాటిపోతోంది.
ఏ రకంగా చూసుకున్నా సిక్స్ గ్యారెంటీస్ పథకాల్లో (దరఖాస్తుల) లబ్దిదారుల సంఖ్య కోటికి పైగానే ఉండేట్లుంది. హామీలను ఇచ్చినది ఇచ్చినట్లు అమలుచేయాలంటే ప్రభుత్వానికి సాధ్యంకాదు. ఎందుకంటే ఖజనాలో అంత నిధులు లేవన్న విషయం తెలిసిందే. పదేళ్ళ కేసీయార్ పాలన రాష్ట్రా ఖజానాను సాంతం ఖాళీచేసేసింది. ప్రభుత్వ అప్పు రు. 7 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. హామీలను అమలుచేయాలంటే ఒక సమస్య. అమలు చేయకపోతే మరో సమస్య. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీలైనంత అప్పులు చేయటమే చేయగలిగింది.