ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఎన్నికల యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మూడు చోట్ల అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. వైసీపీ ప్రకటించిన జాబితా ప్రకారం.. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఇక, టీడీపీ ఇప్పటికీ జాబితా ప్రకటించకపోయినా.. దాదాపు ఇప్పుడున్న ఇంచార్జ్‌లే అభ్యర్థులు కానున్నారనే అంచనాలు వున్నాయి. పైగా ఈ మూడు కూడా.. అత్యంత కీలకమైన నియోజకవర్గాలు.
మరీ ముఖ్యంగా టీడీపీకి, వైసీపీకి కూడా ప్రాణప్రదంగా మారిన నియోజకవర్గాలు. అవే.. గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం. గుడివాడలో అభ్యర్థి ఎవరనేది వైసీపీ ఖరారు చేయకపోయినా.. సంప్రదాయంగా కొడాలి నానికే కేటాయించనున్నారు. ఇక, టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా జాబితా వెల్లడించకపోయినా.. ఎన్నారై వెనిగండ్ల రాముకు ఖరారు చేసింది. తాజాగా నిర్వహించిన రా.. కదలిరా! సభను రాము ఘనంగా నిర్వహించారు.
సో.. ఈ ఇద్దరు నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. సై.. అంటే సై.. అన్నట్టుగా నాయకులు తల పడనున్నారని తెలుస్తోంది. ఎవరు గెలిచినా.. స్వల్ప మెజారిటీతోనేనని ప్రాథమిక అంచనా. ఇక, మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి..కిట్టును పార్టీ ప్రకటించింది. టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. తాజాగా చంద్రబాబు సైతం ప్రకటించారు. అధికారికంగా రావాల్సి ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలోనూ ఈ ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. ఒకరు జూనియర్.. మరొకరు సీనియర్ కావడం గమనార్హం.
ఇక, గన్నవరం.. ఈ విషయంలో ఇరు పార్టీలూ అబ్యర్థులను ఖరారు చేయలేదు. కానీ, ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీవైసీపీ తరఫున, యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ తరఫున పోటీ చేయడం ఖాయం. దీంతో ఉమ్మడి కృష్ణాలో అత్యంత కీలకమైన ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ఫైట్ దాదాపు ప్రారంభమైందనే చెప్పాలి. గుడివాడలో రా.. కదలిరా! సభతోనే ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ప్రచార పర్వం ప్రారంభమైందని పార్టీ నాయకులు చెప్పడం గమనార్హం.
రా.. కదలిరా.. ! సభ వేదికగా చంద్రబాబు కూడా.. ఈ ముగ్గురు నాయకులను పరిచయం చేయడం.. వారిని గెలిపించాలని పిలుపునివ్వడం.. వంటివి టీడీపీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక, వైసీపీ ఇప్పటికే అభ్యర్థలు జాబితాలు తయారు చేస్తున్న దరిమిలా.. ఆ పార్టీ కూడా.. ప్రచారానికి రెడీ అవుతోంది. మొత్తంగా.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మూడు నియోజకవర్గాల్లోనూ సమరం స్టార్ట్ అయిందని తమ్ముళ్లు చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates