గుంటూరు వైసీపీలో సెగ స్టార్ట్ చేశారుగా…!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి సెగ త‌గులుతోంది. ఇదేదో రాజ‌ధాని అమ‌రా వ‌తి అనుకూల వ‌ర్గం నుంచి ఎదుర‌వుతున్న సెగ కాదు. సొంత పార్టీలో సొంత నేత‌ల నుంచే వ‌స్తున్న అస‌మ్మ‌తి. సిట్టింగు ఎమ్మెల్యేల‌పై ఒక‌టి రెండు చోట్ల‌… కొత్త‌గా ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులపై మ‌రోచోట‌.. ఇలా.. పార్టీలో అస‌మ్మ‌తి భారీ ఎత్తున కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. స‌త్తెన‌ప‌ల్లిలో మంత్రి అంబ‌టి రాంబాబు కు టికెట్ ఇవ్వొద్దంటూ.. సొంత నేత‌లే వ్య‌తిరేకిస్తున్నారు.

“గ‌త ఎన్నిక‌ల్లో జెండా భుజాన వేసుకుని.. ఊరూ వాడాతిరుగుతూ ఆయ‌న‌ను గెలిపించాం. ఆయ‌నేమో.. మాపై కేసులు పెట్టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రిని నిల‌బెట్టినా గెలిపించుకుంటాం. అంబ‌టి మాత్రం వ‌ద్దు” అని స్థానిక నాయ‌కులు గ్రూపులు క‌ట్టి మ‌రీ.. చెబుతున్నారు. ఇక‌, ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కొత్త ఇంచార్జ్ కిర‌ణ్‌కుమార్‌కు కూడా సెగ బాగానే త‌గులుతోంది. ఆయ‌న‌ను మెజారిటీ మాల సామాజిక వ‌ర్గం వ‌ద్ద‌ని చెబుతోంది. ఆయ‌న‌ను మార్చాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతోంది.

మ‌రోవైపు, అత్యంత కీల‌క‌మైన గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోనూ వైసీపీకి సెగ ప్రారంభ‌మైంది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తాఫా త‌న కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ ఇప్పించుకున్నారు ప్ర‌స్తుతం ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో దూకుడుగా ఉన్నారు. అయితే.. ఈ కుటుంబానికి టికెట్ ఇవ్వ‌డానికి వీల్లేద‌ని.. మైనారిటీ ముస్లిం నాయ‌కులు ప‌ట్టుబడుతున్నారు. పైగా.. ఈ కుటుంబంపై తీవ్ర ఆరోప‌ణ‌లు కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే కుటుంబం అంతా కూడా.. కేసుల్లో ఉంద‌ని.. కాబ‌ట్టి.. వీరికి ఓటేసేది లేద‌ని తేల్చి చెబుతున్నారు.

ఇక‌, తాడికొండ ప‌రిస్థితి గుంభ‌నంగా ఉంది. ఈ టికెట్‌ను ఆశించిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్‌.. ఇప్పుడు ఐపు అజా లేకుండా పోయారు. ఇక‌, ఇక్క‌డ ఇంచార్జ్‌గా నియ‌మితురాలైన సుచ‌రిత‌కు కూడా.. నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద‌గా ఆస‌క్తి లేకుండాపోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు టీడీపీ ఇక్క‌డ గెలుస్తుంద‌నే అంచ‌నాలు బ‌ల‌ప‌డుతున్న ద‌రిమిలా.. వైసీపీలోనూ నిర్వేదం ఏర్ప‌డింది. మొత్తంగా చూస్తే.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.