టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. గతంలో నిర్వహించిన సభల్లో ప్రకటించిన ‘పూర్ టు రిచ్’ కాన్సె ప్ట్ ను తాజాగా ఆవిష్కరించారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని.. ఆయన జన్మభూమి.. నిమ్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్‌ను చంద్రబాబు ఆవిష్కరిస్తూ.. దీని లక్ష్యాలను కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి.. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి.. అధికారంలోకి వచ్చాక సమగ్రంగా అమలు చేస్తామన్నారు.
ప్రస్తుతం నిమ్మకూరు-నారా వారి పల్లెల్లో ఈ పూర్ టు రిచ్ కాన్సెప్టును ప్రారంభిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పేదలను వారి స్వగ్రామం లేదా.. స్వస్థలంలోనే ధనవంతులను చేసేలా ప్రోత్సహించడమే పూర్ టు రిచ్.. కార్యక్రమం ఉద్దేశమని చంద్రబాబు వెల్లడించారు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించి.. ఈ బాధ్యతలు తీసుకునేలా చేస్తామన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా.. నిమ్మకూరు, నారావారిపల్లె గ్రామాలను చంద్రబాబు ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఉన్న పేదలను అక్కడి వనరులను ఆధారంగా చేసుకుని.. ధనవంతులను చేయాలనే కాన్సెప్టును ఆయన ప్రకటించారు. ఇరు గ్రామాల్లోని వ్యవసాయ భూములను అంచనా వేసి.. ఎంత మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారో తెలుసుకుని.. వ్యవసాయానికి దూరంగా ఉన్న వలస పోయిన వారిని.. వెనక్కి తీసుకువచ్చి.. ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
ఉదాహరణకు ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు గ్రామంలో 1800 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. కేవలం ఇక్కడ 80 మంది రైతు కుటుంబాలు మాత్రమే వ్యవసాయం చేస్తున్నాయని లెక్కలు వివరించారు. ఈ నేపథ్యంలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్ కింద.. ఇదే గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్తలు.. ఇప్పుడు ఈ గ్రామం బాధ్యతలను తీసుకుని.. వలస వెళ్లిన వారిని బాగు చేయడంతోపాటు.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవడానికి చేయూత అందించి ఆర్థికంగా బలోపేతం చేయాలని అన్నారు. ఇదే పూర్ టు రిచ్ కాన్సెప్టని చంద్రబాబు వివరించారు. తమ ప్రభుత్వం వచ్చాక.. అన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేస్తామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates