వైసీపీకి మ‌రో ఎంపీ రాజీనామా.. కీల‌క నేత దూరం!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రో ఎంపీ రాజీనామా చేశారు. ఇప్ప‌టికే క‌ర్నూలు ఎంపీగా ఉన్న బీసీ నాయ‌కుడు సంజీవ్ కుమార్ టికెట్ ద‌క్క‌ని కార‌ణంగా పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.అయితే.. ఈయ‌న త‌న ఎంపీ ప‌ద‌వికి ఇంకా రాజీనామా చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ఈయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌ని స‌మాచారం. ఇదిలావుంటే… తాజాగా ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స‌భ్యుడు, క‌మ్మ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి కూడా వైసీపీకి రాజీనామా చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న తిరిగి మ‌చిలీప‌ట్నం టికెట్‌నే ఆశిస్తున్నారు. కానీ, వైసీపీ అధిష్టానం ఆయ‌న‌ను న‌ర‌స‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గానికి మారాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. 2009లో ఇక్క‌డ నుంచి బాల శైరి పోటీ చేసినా ఓడిపోయారు.  అప్ప‌ట్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న పోటీ చేయ‌డం గ‌మ‌నార్హం. త‌ర్వాత‌.. వైసీపీలో చేరి.. మ‌చిలీప‌ట్నం నుంచి 2019లో పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇప్పుడు ఈయ‌న‌కు ఇక్క‌డ టికెట్ ఇచ్చేందుకు పార్టీ విముఖ‌త వ్య‌క్తం చేస్తోంది. పైగా న‌ర‌స‌రావుపేట త‌ప్ప ఎక్క‌డా అవ‌కాశం లేద‌ని కూడా చెబుతోంది.

దీంతో మ‌న‌స్తాపం చెందిన బాల‌శైరి.. పార్టీకి రాజీనామా చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. మ‌చిలీప‌ట్నం పోర్టు అభివృద్ది, నిర్మాణం విషయంలో ఎంపీగా శైరి త‌న వంతు కృషి చేశారు. ముఖ్యంగా మ‌త్స్య‌కార కుటుంబాల‌ను ఆదుకోవ‌డంలోనూ.. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, నిధులు తీసుకురావ‌డంలోనూ ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. వివాదాల‌కుదూరంగా ఉన్నారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న‌కు పెద్ద‌గా వ్య‌తిరేక‌త కూడా లేద‌ని ఆయ‌న భావిస్తున్నారు. అందుకే త‌న‌కే ఇక్క‌డ సీటు ఇవ్వాల‌ని  బాలశౌరి ప‌ట్టుబ‌డుతున్నారు. కానీ, వ్య‌తిరేక‌త ఉంద‌ని పార్టీ చెబుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు టికెట్ నిరాక‌రించింది.

దారెటు?

ఇక‌, ఇప్పుడు బాల‌శౌరి ఎటు వెళ్తార‌నేది రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. తాజాగా ఆయ‌న జ‌న‌సేన‌కు ట‌చ్‌లో ఉన్నార‌ని, ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తార‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. మ‌చిలీపట్నం ఎంపీ సీటును టీడీపీలోని కొన‌క‌ళ్ల నారాయ‌ణ ఆశిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ఈ ద‌ఫా గెలిచి తీరుతాన‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎంత మిత్ర‌త్వం ఉన్నప్ప‌టికీ.. కొన‌క‌ళ్ల‌ను ప‌క్క‌న పెట్టి బాల‌శౌరికి టికెట్ ఇస్తారా? అనేది సందేహం. మ‌రి ఏం చేస్తారో చూడాలి. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి నాయ‌కులు జారిపోతున్నా.. ఇలాంటి బ‌ల‌మైన బాల‌శౌరిని వ‌దులు కోవ‌డం స‌రికాద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.