తొందరలో జరగబోయే రాజ్యసభ ఎంపీ ఎన్నికలో టీడీపీ పోటీచేయాలని అనుకుంటోంది. రాబోయే ఏప్రిల్ లో ముగ్గురు ఎంపీలు రిటైర్ అవబోతున్నారు. ఏప్రిల్ లో ఖాళీ అవబోతున్న ఎంపీల స్ధానాలను మార్చిలోనే భర్తీ చేయటానికి కేంద్ర ఎన్నికల కమీషన్ రెడీ అవుతోంది. ఫిబ్రవరి చివరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు రాజ్యసభ ఎంపీలకు జరగబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి.
జనరల్ ఎలక్షన్స్ ముందు ఏ పార్టీకైనా మూడు రాజ్యసభ ఎంపీలు రావటమంటే సంతోషమే కదా. సంఖ్యాబలాన్ని చూస్తే మూడుస్ధానాలను వైసీపీ చాలా ఈజీగా గెలుచుకుంటుంది. కాబట్టి వైసీపీ ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవమవ్వటం ఖాయమే. ఎందుకంటే ప్రతి రాజ్యసభ ఎంపీకి 40 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాల్సుంటుంది. ఇదే సమయంలో ఒక్కస్ధానాన్ని గెలుచుకునే అవకాశం కూడా టీడీపీకి లేదు. ఎందుకంటే టీడీపీకి ఉన్నది 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే.
గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో నలుగురు వైసీపీతో సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి టీడీపీకి నికరంగా ఉన్నది 19 మంది ఎంఎల్ఏలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డితో విభేదించి నలుగురు ఎంఎల్ఏలు బయటకొచ్చేసి టీడీపీలో చేరారు. దాంతో టీడీపీ ఎంఎల్ఏల బలం మళ్ళీ 23 అయ్యింది. అయితే రాజ్యసభ ఎంపీని గెలిపించుకునేందుకు టీడీపీకి ఈ బలం ఏమాత్రం సరిపోదు. సంఖ్యాబలం రీత్యా ఇంకా 17 మంది ఎంఎల్ఏల బలముండాలి. ఇక్కడే టీడీపీ పెద్ద వ్యూహాన్ని రచిస్తోంది. అదేమిటంటే ఇపుడు వైసీపీలో టికెట్ల గోల నడుస్తోంది. 2024 ఎన్నికల్లో పోటీచేయటానికి కొందరు ఎంఎల్ఏలకి జగన్ అవకాశం ఇవ్వలేదు.
టికెట్లు దక్కని ఎంఎల్ఏలు జగన్ పై ఆగ్రహంతో కాంగ్రెస్, టీడీపీ, జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరిని గుర్తించి మాట్లాడుకుని వాళ్ళ ఓట్లేయించుకోవాలన్నది వ్యూహం. ఇప్పటికే కొందరు సీనియర్లకు చంద్రబాబు ఈ బాధ్యతలను అప్పగించారనే ప్రచారం మొదలైంది. టికెట్లు దక్కని అసంతృప్తులు ఎంతమందుంటారు ? ఎంతమంది టీడీపీ అభ్యర్ధికి ఓట్లేసే అవకాశాలున్నాయనే లెక్కల్లో సీనియర్ తమ్ముళ్ళు బిజీ అయిపోయారు. మరి చివరకు వీళ్ళ లెక్కలు ఏమవుతాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates