మాజీ ఐఏఎస్ అధికారి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రాజకీయం ఇక ముగిసినట్టేనని వైసీపీ నాయకులు చెబుతున్నారు. 2014లో తిరుపతిపార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్న ఆయనను నియోజకవర్గాల సమీకరణలో భాగంగా గూడూరు అసెంబ్లీకి 2019 లో పంపించారు. అక్కడ కూడా ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ దఫా మాత్రం ఆయనకు టికెట్ లేదని తేల్చి చెప్పడం గమనార్హం.
అంతర్గత వ్యవహారాలు.. అసమ్మతి సెగలు.. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై రెడ్డి సామాజిక వర్గం నాయకుల నుంచి అందిన ఫిర్యాదులే వరప్రసాద్‌కు రాజకీయంగా భవితవ్యాన్ని లేకుండా చేశాయని అంటున్నారు. ప్రస్తుతం ఆయన గూడూరు కాకపోయినా.. తిరుపతి పార్లమెంటు స్థానం కోరుతున్నారు. అయితే.. ఇక్కడ సీఎం జగన్ అత్యంత సన్నిహితుడు, డాక్టర్ గురుమూర్తిని కదల్చడం పార్టీకి ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంటు స్థానం కూడా రిజర్వ్ అయిపోయిందని తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. గూడూరులో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. వరప్రసాద్‌కు టికెట్ ఇవ్వద్దంటూ.. ఎస్సీ వర్గం నాయకులు కూడా డిమాండ్ చేయడంతో పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. పోయి పోయి.. ఈ సీటును ఓడించుకోవడం ఇష్టం లేక.. ఇక్కడ వరప్రసాద్‌ను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని.. పలువురు చెబుతున్నా.. ఈ జాబితాలో చాలా మంది చేరిపోయిన నేపథ్యంలో కేవలం పార్టీకే ఆయన సేవలు పరిమితం అవుతాయని మరికొందరు అంటున్నారు.
సౌమ్యుడిగా పేరున్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్..తన వ్యవహార శైలితో పార్టీ నాయకులకు దూరమ య్యారనేది నిర్వివాదాంశం. తాను తినరు.. ఎవరినీ తిననివ్వరు అనే విధంగా ఆయన వ్యవహరించారని చెబుతారు. ఇదే ఆయనకు, పార్టీ నేతలకు మధ్య దూరం పెంచింది. పైగా.. రెడ్డి సామాజిక వర్గం నాయకు లు తనపై పెత్తనం చేస్తున్నారంటూ.. ఏడాది కిందటే బహిరంగ విమర్శలు చేశారు. ఇది కూడా పార్టీలోఆయనకు మైనస్ మార్కులు పడేలా చేసింది. మొత్తంగా ఈ పరిణామాలు.. పార్టీలో ఆయనకు ఉన్న మంచిపేరు దాదాపు కోతకు గురి చేశాయి. ఇదే ఆయనకు టికెట్ దక్కకుండా చేసిందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates