మాగుంట‌కు లైన్ క్లియ‌ర్‌.. కానీ, పెద్ద టార్గెట్ పెట్టారా..!

నిన్న మొన్నటి వ‌ర‌కు తీవ్ర ర‌స‌కందాయంలో ఉన్న‌ ఒంగోలు ఎంపీ టికెట్ పై స్పష్టత వచ్చింది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించిన అనంతరం పార్టీ అధిష్టానం మాగుంటకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆయ‌న కుమారుడికి కాకుండా.. మాగుంట‌నే ఈ ద‌ఫా పోటీ చేయాల‌ని ఆదేశించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. మాగుంట వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికె ట్ ఉండ‌బోద‌ని, ఆయ‌న పార్టీ మార్పుదిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని ఓ వ‌ర్గం మీడియా ప్ర‌చారం చేసింది. మ‌రీ ముఖ్యంగా పార్టీ మార్పు త‌థ్య‌మ‌ని కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే.. టికెట్ల పై అసంతృప్తితో ఉన్న నాయ‌కుల‌ను బుజ్జగిస్తున్న సీఎం జ‌గ‌న్ ఈ ప‌రంపర‌లోనే మాగుంట‌కు కూడా క‌బురు పెట్టి.. ఆయ‌న‌తో చ‌ర్చించారు.

ఈ క్ర‌మంలో మాగుంట కుమారుడికి ఇప్పుడు కాద‌ని.. ప్ర‌స్తుతం నెల‌కొన్న పోటీ నేప‌థ్యంలో శ్రీనివాసుల రెడ్డినే పోటీచేయాల‌ని సీఎం జ‌గ‌న్ చెప్పినట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే, దీంతో పాటు.. ప్ర‌కాశం జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ను సైతం ద‌త్త‌త తీసుకుని అక్క‌డ వైసీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని పెద్ద టార్గెట్ పెట్టార‌ని తెలిసింది. దీనికి మాగుంట అంగీక‌రించార‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఒంగోలు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మాగంటకు ఈద‌ఫా ఎన్నిక‌లు అత్యంత కీల‌కం.

ఇదిలావుంటే.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షం టీడీపీకి ఇక్క‌డ .. బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం గాలింపు ముమ్మ‌రంగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే మాగుంట పార్టీ మార్పుపై వార్త‌లు రావ‌డం.. ఆ వెంట‌నే టీడీపీలోకివెళ్తార‌ని ప్ర‌చారం జ‌ర‌గడం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు మాగుంట వైసీపీలోనే ఉండనున్న నేప‌థ్యంలో టీడీపీకి ఎవ‌రికి ఇక్క‌డ టికెట్ ఇస్తుంద‌నేదిఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో అప్ప‌టి టీడీపీ నాయ‌కుడు శిద్దా రాఘ‌వ‌రావు ఇక్క‌డ నుంచి పోటీ చేసిన విష‌యం తెలిసిందే.