‘పెనం మీద ఉంటారా.. పొయ్యిలో ప‌డ‌తారా.. ‘

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో త‌మ డిమాండ్లు నెర‌వేర్చ‌లేదంటూ.. ప్ర‌భుత్వ ఉద్యోగులు ర‌గిలిపోతున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వంతు పాత్ర పోషిస్తామ‌ని కూడా వారు హెచ్చరి స్తున్నారు. దీంతో స‌హ‌జంగానే ఉద్యోగుల ఓటు బ్యాంకు వైసీపీకి ఒకింత ఇబ్బందిగా మారింద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో గుడివాడ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని ఉద్యోగుల‌తో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా కొడాలి నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “పెనం మీద ఉంటారో.. పొయ్యిలో ప‌డ‌తారా? తేల్చుకోండి!” అని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు ఫ్రెండ్లీ స‌ర్కార్ అని చెప్పారు. ఇప్ప‌టికే అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించార‌ని.. ఇంకా కొన్ని స‌మ‌స్య‌లు మిగిలి ఉన్నాయ‌ని.. అయితే వాటిని కూడా ప‌రిష్క‌రించేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని.. భావించ‌వ‌ద్ద‌ని.. ప్ర‌భుత్వానికి అండ‌గా ఉంటే.. త‌ర్వాతైనా వాటిని ప‌రిష్క‌రిస్తార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

“ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో ఉద్యోగులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని మాకు కూడా తెలుసు. అయితే.. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే.. ఆయ‌న ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌తో మ‌రిన్ని ఇబ్బందులు మీకు త‌ప్ప‌వు. పెనం మీద ఉండడం కరెక్టా.. పొయ్యిలో పడడం కరెక్టో ఉద్యోగులు ఆలోచించుకోవాలి. మనసు పెట్టి జ‌గ‌న్ ఉద్యోగుల గురించి ఆలోచిస్తున్నారు. ఈ విష‌యంమీరు గుర్తించాలి” అని నాని వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన సొమ్మును కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వం వాడుకుంద‌ని నాని చెప్పారు. పేద‌ల ప‌థ‌కాల‌కు వినియోగించామే త‌ప్ప‌.. వృథా చేయ‌లేద‌న్నారు. ఇది పుణ్య‌మేన‌ని.. దీనిలో ఉద్యోగుల‌కు కూడా భాగం వ‌స్తుంద‌ని అన్నారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్తాన‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డేలా ఉద్యోగులు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విన్న‌వించారు.