లోకేష్ నన్ను కొట్టించాలని చూశాడు: కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం కొద్దిరోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నాని ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నానని ప్రకటించడం సంచలనం రేపింది. రాబోయే ఎన్నికల్లో నానికి టికెట్ ఇవ్వడం లేదని చంద్రబాబు తేల్చి చెప్పడంతో తన పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నానని నాని ప్రకటించారు. దీంతో నాని వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే తాజాగా తాను వైసీపీలో చేరబోతున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.

క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో నాని భేటీ అయ్యారు. కూతురు కేశినేని శ్వేతతో కలిసి జగన్ ను నాని కలిశారు. జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నాని….చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు మోసగాడని ప్రపంచానికి తెలుసని, కానీ మరీ ఇంత పచ్చి మోసగాడు, దగా చేస్తాడు అని తెలియదని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాను ఎంపీనని, తనకున్న ప్రోటోకాల్ ను టిడిపి మర్చిపోయిందని అన్నారు. తన రాజీనామా ఆమోదం పొందిన వెంటనే వైసీపీలో చేరతానని నాని ప్రకటించారు. విజయవాడ అంటే ప్రాణం అని, బెజవాడ కోసం ఏదైనా చేస్తానని నాని అన్నారు. 2014 నుంచి 19 మధ్యలో బెజవాడ కోసం చంద్రబాబు 100 కోట్లు ఇచ్చాడని ప్రశ్నించారు. విజయవాడ రియాల్టీ అని, అమరావతి ఒక కలని అన్నారు. చంద్రబాబును ఎప్పుడు తాను టికెట్ అడగలేదని, ఇప్పుడు జగన్ ను కూడా అడగబోనని అన్నారు.

ప్రస్తుతం జగన్ తో ప్రయాణం చేయాలనుకుంటున్నానని, రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా టిడిపి 60 శాతం ఖాళీ కాబోతోందని నాని జోస్యం చెప్పారు. గతంలో టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడితో తనను తిట్టించారని, చెప్పు తీసుకొని కొడతానని, క్యారెక్టర్ లెస్ ఫెలో అని తిట్టినా పార్టీ స్పందించలేదని, గొట్టం గాడు అన్నా భరించానని అన్నారు. విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబు నిర్ణయించారని, కానీ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తనను కొందరు తిట్టించారని ఆరోపించారు. తనను అవమానించినా పార్టీ చర్యలు తీసుకోలేదని వాపోయారు. పార్టీలో నుంచి వెళతానని చంద్రబాబుతో చెబితే నువ్వు ఉండాల్సిందే అని చెప్పారని గుర్తు చేసుకున్నారు.

తాను 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకున్నానని, టీడీపీ కోసం డబ్బు సమయం వృధా చేయొద్దని చాలామంది ముందే చెప్పినా తాను వినలేదని అన్నారు. తన కుటుంబ సభ్యులతో తనను కొట్టించాలని లోకేష్ చూశారని సంచలన ఆరోపణ చేశారు. మరి, తాజాగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలస్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, వైసీపీలో చేరేందుకు నాని కొన్ని షరతులు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది. తనకు విజయవాడ ఎంపీ టికెట్, తన కూతురు శ్వేతకు విజయవాడ ఈస్ట్ టికెట్, ఎంఎస్ బేగ్ కు విజయవాడ వెస్ట్ టికెట్, నందిగామ టికెట్ ను కన్నెగంటి జీవరత్నంకు, తిరువూరు టికెట్ నల్లగట్ల స్వామి దాసులకు కేటాయించాలని, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు టికెట్ ఇవ్వాలని నాని అడిగినట్లుగా తెలుస్తోంది.