1+1 ఆఫ‌ర్‌.. ఇదీ కేశినేనికి వైసీపీ హామీ!

తాజాగా వైసీపీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ధ‌మైన విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేనికి సీఎం జ‌గ‌న్ 1+1 ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సుదీర్ఘ ర‌హ‌స్య మంత‌నాలు.. చ‌ర్చ‌లు.. అనేక డిమాండ్ల త‌ర్వాత‌.. కేశినేని గుట్టు విప్పారు. నేరుగా తాడేప‌ల్లికి వెళ్లి.. సీఎం జ‌గ‌న్‌ను క‌లుసుకున్నారు. ఆయ‌నపై పొగ‌డ్త‌ల‌కు కురిపించ‌లేదు కానీ.. ఫ‌క్తు.. రాజ‌కీయ నాయ‌కుడు అనిపించేశారు. టికెట్ ఇచ్చి, రెండు సార్లు ఎంపీ అయ్యే అవ‌కాశం క‌ల్పించిన టీడీపీపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అయినా.. విమ‌ర్శ‌లు చేయ‌ని నాయ‌కుడు.. అంటూ.. ఇప్పుడులేని నేప‌థ్యంలో కేశినేనిని కూడా అంద‌రిలాగానే భావించాల్సి ఉంది.

ఇక‌, వైసీపీ నుంచి కేశినేని ప్ర‌ధానంగా ఆశించిన‌వి.. టీడీపీలో ద‌క్క‌నివి ప‌రిశీలిస్తే.. రెండే రెండు.. ఒక‌టి త‌న‌కు ఎంపీ సీటు. విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచి మూడోసారి కూడా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకుని.. హ్యాట్రిక్ కొట్టాల‌ని.. త‌ద్వారా విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో రికార్డు సృష్టించాల‌ని కేశినేని వ్యూహం. గ‌తంలో 2004, 2009లో ఒక్క‌సారి మాత్రమే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకుని విజ‌య‌వాడ ఎంపీ అయ్యారు. దీనికి ముందు చాలా మంది ఎంపీలు గెలిచినా..వ‌రుస‌గా మూడుసార్లు ఎవ‌రూ విజ‌యం ద‌క్కించుకోలేదు.

ఈ రికార్డును తాను సాధించాల‌నేది కేశినేని వ్యూహం. అయితే.. అస‌లు టీడీపీ ఈ ద‌ఫా టికెట్ నిరాక‌రించింద‌నేది ప్ర‌ధాన చ‌ర్చ‌. దీనికి తోడు.. ఎప్ప‌టి నుంచో కేశినేని త‌న కుమార్తె శ్వేత‌కు విజ‌య‌వాడ తూర్పు లేదా.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆశిస్తు న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ క‌న్ఫ‌ర్మ్ అనుకున్నాక‌.. అనూహ్యంగా స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. దీంతో తూర్పుపై క‌న్నేసిన ఆయ‌న ఇక్క‌డైనా టికెట్ ఇవ్వాల‌ని కోరారు. ఈ రెండు సాధ్యం కాలేదు. ఈ ఎన్నిక‌ల్లో అయినా.. ఆయ‌న తూర్పు నుంచి కుమార్తెను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు.

అయితే.. టీడీపీకి ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడు గ‌ద్దె రామ్మోహ‌న్ ఉన్నారు. దీంతో ఇప్పుడు కూడా శ్వేత‌కు అవ‌కాశం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో 1+1 ఆఫ‌ర్ కోసం వేచి చూసిన కేశినేని.. ఇది ఎలానూ ద‌క్క‌ద‌ని భావించి.. పార్టీతో విభేదించారు. ఇదేస‌మ‌యంలో తూర్పులో పాగావేయాల‌న్న‌.. వైసీపీకి కేశినేని వ్యూహానికి మ‌ధ్య పొంత‌న ఉండ‌డంతో అనూహ్యంగా ఇప్పుడు రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారాయి. దీంతో ఇటు వైసీపీ కూడా ఆయ‌న‌ను ఆహ్వానించ‌డం.. ఆయ‌న సై అన‌డం రెండూ ఒకే సారి జ‌రిగాయి. మొత్తానికి విజ‌య‌వాడ ఎంపీ టికెట్‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం స్థానం రెండూ కూడా కేశినేని ఖాతాలో ప‌డేందుకు మార్గం సుగ‌మం అయింద‌ని అంటున్నారు.