రాబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీలో కూడా పోటీ పెరిగిపోతోంది. వైసీపీ, టీడీపీల్లో సీటుకోసం పోటీ ఉందంటే అర్ధంచేసుకోవచ్చు. ఎందుకంటే రెండూ బలమైన పార్టీలు కాబట్టి సహజంగానే నేతలు ఎక్కువమంది ఉంటారు. కానీ బీజేపీలో కూడా పోటీ ఉందంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విశాఖపట్నం నుండి పోటీచేయాలని బీజేపీ ఆశిస్తోంది. ఇపుడు పార్టీలోనే ముగ్గురు నేతల మధ్య పోటీ పెరిగిపోతోంది.
చాలాకాలంగా రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు విశాఖపట్నం నగరంపై కన్నేశారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడనుండి పోటీచేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ విశాఖలో ఇంటిని ఏర్పాటుచేసుకున్నారు. వైజాగ్ కేంద్రంగా చాలాకాలంగా పార్టీలో చొచ్చుకుపోతున్నారు. పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం అయినా జీవీఎల్ విశాఖలోనే చేస్తున్నారు. దీంతో విశాఖ నుండి జీవీఎల్ పోటీచేయబోతున్నారన్న విషయం అర్ధమైపోయింది.
తర్వాత సడెన్ గా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా వైజాగ్ మీద కన్నేశారట. ఈమె కాంగ్రెస్ తరపున రెండోసారి ఇక్కడనుండే గెలిచి కేంద్రమంత్రయ్యారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తే డిపాజిట్లు కూడా దక్కలేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇక్కడినుండే పోటీచేయాలని పట్టుదలతో ఉన్నారట. అందుకనే ఆమె తరచూ వైజాగ్ లోనే పర్యటిస్తున్నారు. వీళ్ళిద్దరి విషయాన్ని పక్కనపెట్టేస్తే మరో ఎంపీ సీఎం రమేష్ కూడా వైజాగ్ పై కన్నేసినట్లు ప్రచారం మొదలైంది. కడప జిల్లాకు చెందిన రమేష్ వైజాగ్ పై కన్నేయటానికి కారణం ఏమిటంటే ఈ నియోజకవర్గం పరిధిలో వెలమ సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉండటమేనట.
నిజానికి వీళ్ళముగ్గురి ఆశలన్నీ టీడీపీపైనే ఉంది. ఎందుకంటే టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుంటుందని వీళ్ళు బలంగా నమ్ముతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వైజాగ్ నుండి చాలా ఈజీగా గెలవచ్చని పై ముగ్గురు నేతలు ఆశపడుతున్నారు. అందుకనే ఎవరికి వాళ్ళుగా వైజాగ్ సీటుపై కన్నేసినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. మరి వీళ్ళల్లో ఎవరికి ప్రజాబలం ఉందని అడిగితే ఎవరికీ లేదనే చెప్పాలి. అందుకనే టీడీపీ, జనసేన బలంపైన ఆశలుపెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. మరి చివరకు ఎవరు పోటీచేస్తారో చూడాలి.