బాబుకు మరింత బూస్ట్..3 కేసుల్లో బెయిల్

టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో పలు కేసులు పెట్టిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కాం అంటూ చంద్రబాబుపై మొదటి కేసు నమోదు చేసిన ఏపీ సిఐడి చివరకు మద్యం దుకాణాల కేటాయింపులలో అవకతవకల కేసుతో ఈ కేసుల పర్వానికి కామా పెట్టిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ తర్వాత స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించినప్పటికీ మిగతా కేసులలో విచారణ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఇసుక కేసు, మద్యం కేసులలో హైకోర్టు భారీ ఊరటనిచ్చింది.

ఈ మూడు కేసులలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ టీ మల్లికార్జునరావు ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. ఇక, మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ నరేశ్ లకు కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసు, ఇసుక పాలసీ లో అవకతవకల కేసు, మద్యం దుకాణాల అనుమతుల కేసులకు సంబంధించి చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది.

చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సుప్రీం కోర్టు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అసలు ఏర్పాటు కాని, ఇప్పటివరకు రాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఆరోపణలు చేస్తుండటం సహేతుకం కాదని లూథ్రా వాదనలు వినిపించారు. తన అనుయాయులకు చంద్రబాబు మేలు చేకూర్చారన్న ఆరోపణలను లూథ్రా తోసి పుచ్చారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇసుక ఉచితంగా, వేగంగా అందుబాటులోకి రావాలన్న సదుద్దేశంతోనే ఆనాటి టిడిపి ప్రభుత్వం ఇసుక పాలసీని రూపొందించిందని, అయితే దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందంటూ వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందని అన్నారు.

ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని చంద్రబాబుకు ఆపాదించి దానిని నేరంగా పరిగణించడం సరికాదన్నారు. అదే తరహాలో మద్యం పాలసీకి సంబంధించి కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయనకు వ్యక్తిగతంగా ఆపాదిస్తూ కేసు పెట్టారని లూథ్రా వాదనలు వినిపించారు. వాస్తవానికి నెల రోజుల క్రితం ఈ మూడు కేసులలో వాదనలు పూర్తయ్యాయి. కానీ, జస్టిస్ సి మల్లికార్జున రావు నేతృత్వంలోని బెంచ్ ఆ మూడు కేసులలో తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం ఆ కేసులకు సంబంధించి చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ వచ్చేలాగా కీలక తీర్పు వెలువడింది. ఈతీర్పుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.