ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదలైన ఈ కార్యక్రమం ఈ రోజు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన చంద్రబాబు బహిరంగ సభకు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నంద్యాలలో సభ దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం చంద్రబాబుకు నీరాజనం పలికారు.
ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ అన్న జగన్ కు ఓటేసిన అనర్హుడిని అందలం ఎక్కించామని బాధపడుతున్నారని చురకలంటించారు. జగన్ కు రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులు మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. రాతియుగం వైపు వెళ్తారా? స్వర్ణ యుగం కోసం తనతో వస్తారా అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని, ధ్వంసం అయిందని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని రాబోయే ఎన్నికలతో అందరి కష్టాలు తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
నంద్యాల ప్రజల జోరు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని అనిపిస్తోందని, ఈ జన సునామీ చూసి తాడేపల్లి ప్యాలెస్ వణుకుతోందని చెప్పారుజ ఓర్వకల్లుకు 15 నెలల్లోనే విమానాశ్రయాన్ని తీసుకువచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కును జగన్ అటకెక్కించారని చురకలంటించారు. జగన్ రాయలసీమ ద్రోహి అని, కర్నూలుకు హైకోర్టు తెస్తానని మోసం చేస్తున్నారని అన్నారు. ఇక, కర్నూలుకు హైకోర్టు బెంచ్ తెచ్చే బాధ్యత తమదని చంద్రబాబు చెప్పారు.
రాయలసీమకు 350 టీఎంసీల నీటిని అందించడమే తన లక్ష్యమన్నారు. మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులను జగన్ మోసం చేశాడని, ఎన్నో కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయని విమర్శించారు. టీడీపీ, జనసేన జెండాను యువత పట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక, జగనన్న వదిలిన బాణం ఎక్కడ ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వివేకాను హత్య చేసి ఎన్నో డ్రామాలు ఆడారని, ఆఖరికి వివేకా కూతురుపై, సీబీఐ అధికారులపై కూడా కేసులు పెట్టారని అన్నారు. చెత్తపై కూడా పని చేసిన చెత్త ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని చంద్రబాబు అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates