‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మగతనం తప్ప.. పగతనం లేదు’ అని ఆయన మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ ఎస్ పార్టీ నాయకులతో తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపైనా.. పాలకులపైనా ఆయన నిశిత విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ పదేళ్లు పాలించినా.. ఎవరిపైనా పగ తీర్చుకునేలా వ్యవహరించలేదన్నారు.
కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు.. బీఆర్ ఎస్ నాయకులపై పగతీర్చుకునేలా పాలన చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. ఇప్పటికే చాలా మందిపై జిల్లాల స్థాయిలో కేసులు నమోదయ్యాయన్నారు. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలపైనా తీవ్ర స్థాయిలో కేసులు పెట్టేందుకు తెరచాటున పక్కా స్కెచ్ వేస్తున్నారని తెలిపారు. అయితే.. ఇలాంటి చర్యలకు బీఆర్ఎస్ నాయకులు భయపడబోరని హరీష్ రావు చెప్పారు. గతంలో పదేళ్లు పాలించిన కేసీఆర్..ఇలా కక్షసాధింపు చర్యలకు దిగి ఉంటే.. ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అందరూ.. జైల్లోనే ఉండేవారని వ్యాఖ్యానించారు.
ఇక, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్‌లో మూడు గ్రూపులు ఉన్నాయని హరీష్‌రావు అన్నారు. ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్, మరొకటి టీడీపీ కాంగ్రెస్, ఇంకొకటి అసలు కాంగ్రెస్ అని అన్నారు. ఎవరు ఎలా ఉన్నా.. బీఆర్ ఎస్ గెలుపు కోసం అందరూ కలసి కట్టుగా పోటీ చేయాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఖమ్మం టికెట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.
పథకాలపై..
కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునేందుకు అలివి మీరిన హామీలను ఇచ్చిందన్న హరీష్‌రావు.. వాటిని అమలు చేసేందుకు తాత్సారం చేస్తోందని విమర్శించారు. అందుకే ప్రతి పథకం అమలుకు 100 రోజుల డెడ్ లైన్ అంటూ .. ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. కానీ, అప్పటికి కూడా కాంగ్రెస్ ఆయా పథకాలను అమలు చేయడం సాధ్యంకాదన్నారు. ప్రజలే ఈ విషయంపై కేసులు పెట్టే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.