పవన్ మారథాన్ మీటింగ్స్

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీ అయిపోతున్నారు. వరసబెట్టి పార్టీలోని ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. డైరెక్టుగా జిల్లాలకు వెళ్ళి నేతలను పిలిపించుకుని క్షేత్రస్థాయి పరిస్ధితులను సమీక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుండి మంగళగిరి పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు. సోమవారం నుండి రెండురోజుల పాటు ముఖ్యనేతలతో సమావేశం అవబోతున్నారు. వన్ టు వన్ సమావేశాలు నిర్వహించాలని అనుకున్న నేతలందరినీ పార్టీ ఆఫీసుకు రావాలని కబురు పంపారు.

మొన్నటికి మొన్న కాకినాడ జిల్లా కేంద్రంలో కూర్చుని 14 నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో మూడురోజులు సమావేశం అయిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లాలోని నేతలతో పాటు కోనసీమ జిల్లాలోని నేతలతో కూడా పవన్ భేటీలు జరిపారు. రాష్ట్రంలో ఏ ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది, పోటీచేస్తే గెలిచే నియోజకవర్గాలు ఏవి, పోయిన ఎన్నికల్లో 30 వేలకు పైగా ఓట్లు సాధించిన నియోజకవర్గాలు ఏవనే విషయంలో పవన్ ఇప్పటికే ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా ఒకటికి రెండుసార్లు సర్వేలు కూడా చేయించుకున్నారు.

వీటన్నింటినీ దగ్గర పెట్టుకుని ముఖ్యనేతలను పిలిపించుకుని క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు చేస్తున్నారు. ముఖ్యనేతలతో వన్ టు వన్ సమావేశాలు,, సమీక్షలు చేయటం ద్వారా పోటీచేయాల్సిన నియోజకవర్గాల సంఖ్య, నియోజకవర్గాలను పవన్ ఫైనల్ చేయబోతున్నట్లు సమాచారం. టీడీపీతో పొత్తులో భాగంగా నియోజకవర్గాలను పవన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇలాంటి కసరత్తునే చంద్రబాబు చాలాకాలంగా చేస్తున్నారు. స్థూలంగా జనసేనకు కేటాయించాల్సిన సీట్లు, నియోజకవర్గాలపై చంద్రబాబు క్లారిటితోనే ఉన్నారట.

అందుకనే ఇలాంటి క్లారిటి కోసమే పవన్ కూడా కసరత్తులు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయి. సీట్ల సంఖ్య, నియోజకవర్గాల్లో కాస్త అటు ఇటు తేడాలు వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరంలేదని పవన్ ముఖ్యనేతలతో అంటున్నారట. అంటే ముందునుండే తనపార్టీలోని నేతలను, పోటీచేయాలని ఆశపడుతున్న ముఖ్యులను మెంటల్ గా పవన్ ప్రిపేర్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. తొందరలోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలతో కూడా భేటీలు ఉండబోతున్నట్లు సమాచారం.