ఏపీలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు.. రేవంత్ ఏమ‌న్నారంటే

ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌ట్టిపోటీ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ నుంచి త‌ప్పుకొంది. ఇది కాంగ్రెస్‌కు భారీగా క‌లిసి వ‌చ్చింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. పైగా తెలంగాణ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గ‌తంలో టీడీపీ నుంచే రావ‌డం.. ఆయ‌న ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడ‌నే పేరు కూడా ఉండ‌డం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో చంద్ర‌బాబుకు స‌హ‌క‌రించే విష‌యం ఆస‌క్తిగా మారింది. ఇదే విష‌యంపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. తాను వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబును అభిమానిస్తాన‌ని ఆయ‌న చెప్పారు.

అయితే.. అదేస‌మ‌యంలో తాను ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్రంలో అధ్య‌క్షుడిగా ఉన్నాన‌ని రేవంత్ చెప్పారు. ఏపీ అనేది పొరుగు రాష్ట్ర‌మ‌ని.. ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయ‌కులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది త‌న‌కు తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు. 1995 తరువాత చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ లు  పాలన పరంగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకులని చెప్పారు. ప్రజల్లో తమకంటూ చెరగని ఓ ముద్ర వేసుకున్నారని అన్నారు. ఈ ముగ్గురునీ దృష్టిలో ఉంచుకుని పోల్చుకుంటే.. త‌న‌పై బాధత్య ఎక్కువగా ఉంటుందని రేవంత్ తెలిపారు. ఏమాత్రం తడబాటు పడినా.. రాష్ట్రానికే నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.

ఈ నేప‌థ్యంలో ఏపీలో అనుస‌రించే విధానాలు, రాజ‌కీయాల‌పై తాను జోక్యం చేసుకునే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మనో ధైర్యం వచ్చిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం వల్ల.. ఏపీలోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలిపారు. అయితే, తమిళనాడు, కర్ణాటక రాజకీయాలు ఎలాగో.. ఏపీ రాజకీయాలు కూడా తనకు అలాగే అని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారని, వారి నిర్ణయాలు వారు తీసుకుంటారని, అంత‌కు మించి తాను ఎలాంటి బాధ్య‌త‌లు తీసుకునే అవ‌కాశం లేద‌ని వ్యాఖ్యానించారు.