ఈ సారి లోక్‌సభ టిక్కెట్ల ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు అదిరిపోయే స్ట్రాటజీలతో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ ఎంపీ టిక్కెట్లను ఈ సారి బీసీలకు ఇచ్చే ప్లానింగ్ జరుగుతోంది. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నరసారావుపేట, హిందూపురం, కర్నూలు సీట్లతో పాటు ఓవరాల్‌గా ఆరేడు సీట్లు ఈ సారి ఖచ్చితంగా బీసీలకు దక్కనున్నాయి. ఈ ఈక్వేషన్లతోనే ఈ సారి పలువురు కొత్త నేతలు టీడీపీ నుంచి లోక్‌సభకు పోటీపడనున్నారు.
ఉభయగోదావరి జిల్లాల నుంచి ఈ సారి ఒక సీటు ఖచ్చితంగా బీసీలకు దక్కనుంది. ఈ మేరకు చంద్రబాబు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న ఐదు పార్లమెంటు సీట్లలో అమలాపురం రిజర్వ్‌డ్ పోగా.. కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, నరసాపురం పార్లమెంటు సీట్లు జనరల్‌గా ఉన్నాయి. కాకినాడ కాపు వర్గం, నరసాపురం క్షత్రియవర్గం కోటాలో ఖరారు కానున్నాయి. రాజమహేంద్రవరం, ఏలూరు నుంచి టీడీపీ తరపున గత నాలుగైదు ఎన్నికల్లోనూ కమ్మ నేతలో పోటీ పడుతున్నారు.
గత ఎన్నికల్లో రాజమహేంద్రవరంలో వైసీపీ బీసీ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది. ఈ సారి కూడా అక్కడ బీసీ శెట్టిబలిజ వ్యక్తికే వైసీపీ సీటు ఇవ్వనుంది. ఇక టీడీపీ రాజమండ్రి, ఏలూరులో రాజమండ్రి కమ్మ, ఏలూరు బీసీలకు ఇచ్చేలా కార్యాచారణ చేస్తోంది. ఏలూరు నుంచి బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గం నుంచి గోరుముచ్చు గోపాల్ యాదవ్ రేసులో ముందంజలో ఉన్నారు. పార్టీ మచిలీపట్నం సీటును బీసీల్లోనే మరో బలమైన వర్గమైన గౌడ వర్గానికి కేటాయిస్తూ సక్సెస్ అవుతోంది.
2009లో యాదవులకు ఒంగోలు, 2019లో నెల్లూరు సీట్లు ఇచ్చినా అక్కడ వారు విజయం సాధించలేదు. 2009లో ఒంగోలులో పోటీ చేసిన కొండయ్య యాదవ్, 2019లో నెల్లూరులో పోటీ చేసిన బీద మస్తాన్‌రావు యాదవ్ ఇద్దరూ ఓడిపోయారు. దీంతో ఈ సారి యాదవ వర్గం ఓటర్లు బలంగా ఉన్న ఏలూరు పార్లమెంటు నుంచి ఆ వర్గానికే చెందిన నేత, ఆర్థికంగా బలంగా ఉన్న గోరుముచ్చును రంగంలోకి దింపుతోంది. లోకేష్ ఈ సారి యాదవులకు ఓ పార్లమెంటు సీటు ఇస్తున్నట్టు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఆర్థికంగా కూడా పార్టీ సూచించిన ఫిగర్ సర్దుబాటు చేస్తానని గోరుముచ్చు ఓకే చెప్పడంతో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ గోరుముచ్చు విషయంలో పక్కా క్లారిటీతోనే ఉన్నారని తెలిసింది.
40 ఏళ్లలో ఫస్ట్ ప్రయోగం ఇది…
ఏలూరు పార్లమెంటు నుంచి గత 40 ఏళ్లలో ఏ పార్టీ నుంచి అయినా కమ్మలే గెలుస్తూ వస్తున్నారు. వైసీపీ గత ఎన్నికల్లో ఫస్ట్ టైం వెలమ వర్గానికి చెందిన కోటగిరి శ్రీథర్‌కు సీటు ఇవ్వగా విజయం సాధించారు. ఇక టీడీపీ పార్టీ ఆవిర్భవించాక ఫస్ట్ టైం ఇక్కడ బీసీ ప్రయోగానికి రెడీ అవుతోంది. ఈ పార్లమెంటు పరిధిలో 2 లక్షల పై చిలుకు యాదవుల ఓటింగ్ ఉంది. నూజివీడు నుంచి యాదవ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఇప్పటికే రెండుసార్లు సీటు ఇచ్చారు. ఈ సారి ఏలూరు పార్లమెంటు కూడా ఇస్తే యాదవుల ఓటింగ్ పార్టీకి వన్ సైడ్ అయిపోతుందని రాబిన్‌శర్మ టీం లెక్కలు తేల్చేసింది. పైగా గోరుముచ్చు స్థానికుడు. పార్లమెంటు పరిథిలోని చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలంలోని కంఠమనేనివారి గూడెం ఆయన స్వగ్రామం. ఇటు కుల బలం, అటు ఆర్థిక, అంగ బలాలు పుష్కలంగా ఉండడంతో పార్లమెంటు పరిధిలో ఉన్న పార్టీ నేతల నుంచి కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ లభిస్తోంది.