ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో కొత్తగా కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే తోందరలోనే బస్సుయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారట. పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పట్లో ఎవరివల్లా అయ్యేపనికాదు. అయితే అంతటి మోయలేని భారాన్ని షర్మిల భుజాన వేసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని పెద్ద శపథమే చేశారు. ఇందులో భాగంగానే షర్మిల రాష్ట్రమంతా పర్యటనలు జరపాలని అనుకున్నారు. ఆ పర్యటనలు పాదయాత్ర రూపంలోనా లేకపోతే బస్సుయాత్రల రూపంలోనా అన్న చర్చ ఢిల్లీలోని ముఖ్యనేతల దగ్గర జరిగింది.
ఎన్నికలకు ఎక్కువ వ్యవధిలేని కారణంగా పాదయాత్ర సాధ్యంకాదని బస్సుయాత్ర అయితేనే సాధ్యమని షర్మిల అభిప్రాయపడ్డారట. నిజానికి పాదయాత్రలు షర్మిలకు పెద్ద కష్టంకాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నపుడు అన్న తరపున ఆమె రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. అలాగే తెలంగాణాలో పార్టీ పెట్టుకున్నపుడు కూడా రెండోసారి పాదయాత్ర చేశారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో పాదయాత్ర చేసే అవకాశం షర్మిలకు లేదు. ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 17వ తేదీన కొడుకు రాజారెడ్డి వివాహం జరగబోతోంది. ఈ రెండు కారణాల వల్ల పాదయాత్రకు షర్మిల కుదరదని అనుకున్నారు.
అందుకనే బస్సుయాత్రవైపు మొగ్గుచూపారట. అంతకన్నా ముందు పార్టీలో షర్మిలకు ఏదో కీలకమైన పోస్టు ఇవ్వకపోతే ఆ ఎఫెక్టు ఉండదని కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. కర్నాటక లేదా తెలంగాణా నుండి షర్మిలను రాజ్యసభ ఎంపిగా నామినేట్ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.
అదే నిజమే అయినా పార్టీలో ఒక హోదాను సూచిస్తుందే కానీ పదవిని కాదు. ప్రజల్లోకి వెళ్ళాలంటే పార్టీలో కీలకమైన పదవి ఉండాల్సిందే. అంటే పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే పార్టీలో కానీ లేదా జనాల్లో కాని మంచి జోష్ వస్తుందని అనుకుంటున్నారు. ఇదే సమయంలో షర్మిలకు సారధ్య బాధ్యతలు అప్పగిస్తే వైసీపీ, టీడీపీలో పోటీకి టికెట్లు దక్కని వాళ్ళంతా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తొందరలోనే పార్టీలో కీలకస్ధానం అప్పగించి బస్సుయాత్రలు చేయించటానికి సూత్రప్రాయంగా డిసైడ్ అయినట్లు సమాచారం.