ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శి. రాజకీయాల్లో ఎప్పుడూ ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గానే ఉంటుంది. గత ఎన్నికల సమయంలోనూ దర్శి నియోజకవర్గం భారీ ఎత్తున రాజకీయాల కు కేంద్రంగా మారింది. తాజాగా కూడా ఈ నియోజకవర్గం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న విద్యా సంస్థల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్.. వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి ఈ దర్శి టికెట్ వైసీపీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించేశారు. ఇది ఆయనకు మాత్రమే రిజర్వ్ చేసిన నియోజక వర్గం అనడంలోనూ సందేహం లేదు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయనని చెప్పిన దరిమిలా.. మద్దిశెట్టి ని తీసుకువచ్చి జగన్ టికెట్ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే బూచేపల్లి పోటీకి సై అన్నారు. దీంతో ఆయనకే అప్రకటితంగా సీఎం జగన్ టికెట్ ఇచ్చారు.
దీంతో అలిగిన మద్దిశెట్టి.. తాజాగా సీఎం జగన్‌ను కలిసి.. తన అభ్యర్థన వినిపించారు. కానీ, ఆయనకు టికెట్ లేదని సీఎం జగన్ చెప్పారు. కానీ, మద్దిశెట్టి మాత్రం ఫైరయ్యారు. తనకు టికెట్ రావాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనికి సీఎం జగన్ కూడా పట్టుదలకు పోరాదని సూచించారు. మొత్తంగా టికెట్ విసయం అయితే తేల్చలేదు. ఇదిలావుంటే.. కొన్నాళ్ల కిందటి వరకు జనసేనతో టచ్‌లోకి వెళ్లిన మద్దిశెట్టి.. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
కానీ, ఇంతలోనే స్థానికంగా ఉన్న మరో నాయకుడు జనసేనలో చేరి టికెట్ పై హామీ కూడా తెచ్చుకున్నా రు. దీని ప్రకారం చూస్తే.. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆయనే అయ్యే అవకాశం ఉంది. దీంతో మద్దిశెట్టి ఇప్పుడు పార్టీ మారే ఆలోచన చేసినా ప్రయోజనం లేదని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా చూస్తే.. వైసీపీలోనే సర్దు కోవడం లేదా.. ఇండిపెండెంట్‌గా పోటీకి దిగడం.. ఇంతకు మించి మద్దిశెట్టికి మరో మార్గం లేదని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates