2024 – ఏపీ రాత రాసేది బీసేలేనా

రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా బీసీల ఓట్లే కీలకంగా మారాయి. జనాభాలో బీసీ సామాజికవర్గాలు సగమున్నాయి. దాదాపు 139 ఉపకులాలున్న బీసీలు ఎన్నికల విషయంలో దాదాపు ఐకమత్యంగానే ఉంటాయి. అందుకనే ఇపుడు బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు, ఆకర్షించేందుకు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. బీసీల్లో పట్టు నిలుపుకునేందుకు జగన్ పాట్లు పడుతుంటే పోయిన పట్టును తిరిగి సాధించేందుకు చంద్రబాబు అవస్తలు పడుతున్నారు.

రెండు పార్టీలు కూడా పోటీపోటీగా బీసీల కోసం చేస్తున్న యాత్రలే ఇందుకు నిదర్శనం. వైసీపీయేమో సామాజిక సాధికార యాత్రలు చేస్తోంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో మంత్రుల ఆధ్వర్యంలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, మహిళా నేతలను కలిసి బస్సుయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నియోజకవర్గ కేంద్రాల్లో రోడ్డుషోలు, బహిరంగసభలు జరుపుతున్నారు. తమ బస్సుయాత్రలు సూపర్ సక్సెస్ అయ్యాయని మంత్రులు, వైసీపీ నేతలు సంబరపడుతున్నారు. కానీ అలాంటివి విజువల్స్ కనిపించడం లేదు ఎక్కడా.

ఇదే సమయంలో బీసీలకు న్యాయం చేసిందే టీడీపీ అంటు చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అసలు టీడీపీ అంటేనే బీసీల పార్టీగా చెప్పుకుంటున్నారు. ఎన్టీయార్ హయాంలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేస్తున్నారు. ఇపుడు కనిగిరిలో మొదలైన జయహో బీసీ..రా కదలిరా అనే నినాదంతో మొదలైన బహిరంగసభలు ఇందులో భాగమే. 175 నియోజకవర్గాల్లోను పార్టీలోని బీసీ నేతల ఆధ్వర్యంలో సభలు నిర్వహించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. అలాగే 24 రోజుల్లో 25 బహిరంగసభలు నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగసభల్లో బీసీలకు టీడీపీ చేసిన మేలును గుర్తుచేయటమే అసలు ఉద్దేశ్యం.

బీసీలకు ఎవరి హయాంలో మేలు జరిగిందన్న విషయాన్ని చెప్పుకుంటున్న రెండు పార్టీలు పనిలోపనిగా ప్రత్యర్ధి పార్టీ పైన తీవ్రస్ధాయిలో ఆరోపణలు కూడా గుప్పిస్తున్నాయి. గడచిన నాలుగున్నరేళ్ళల్లో బీసీలకు జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మంత్రులు, నేతలు గుర్తుచేస్తున్నారు. ఇదే సమయంలో బీసీలకు జగన్ వల్ల జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు అండ్ కో ప్రస్తావిస్తున్నారు. జగన్, చంద్రబాబు వైఖరి చూస్తుంటే బీసీల మద్దతు లేకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యంకాదని డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే పదేపదే బీసీల జపంచేస్తున్నారు. మరి బీసీలు ఎవరికి పట్టంకడుతారో చూడాలి.