తక్కువ రేటుకే క్వాలిటీ లిక్కర్ – బాబు భరోసా

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ‘రా.. క‌ద‌లిరా!’ తొలి స‌భ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో అత్యంత భారీగా నిర్వ‌హించారు. వేలాది మందిని స‌మీక‌రించారు. ఈ స‌భ‌లో చంద్ర‌బాబు ఆద్యంతం అత్యంత ఉద్వేగ భ‌రితంగా మాట్లాడారు. వైసీపీ స‌ర్కారుపైనా.. సీఎం జ‌గ‌న్ పైనా ఆయ‌న నిప్పులు కురిపించారు. ఏపీని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 30 ఏళ్ల వెన‌క్కి తీసుకువెళ్లార‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల‌పై వరాల జ‌ల్లు కురిపించారు.

టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే….జగన్ గంజాయి ఇస్తున్నాడని చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో వీరబాదుడు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయ‌న్నారు. జగన్ దోపిడీ వల్ల విద్యుత్ బిల్లులు పెరిగాయని, చెత్త నుంచి సంపద సృష్టించాలని తాము ప్రయత్నించామ‌న్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తే జగన్ ట్రాక్టర్ ఇసుకకి 5000 వేల రూపాయలు వసూలు చేస్తున్నాడని విమ‌ర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. జాతీయ స్థాయిలో జరిగిన సర్వేలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది” అని చంద్రబాబు తెలిపారు. “2019 లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మోసపోయామని ప్ర‌జ‌లే చెబుతున్నారు. ఇంత‌క‌న్నా ఒక ప్ర‌భుత్వానికి ఏం కావాలి. ఇదే చెంప‌పెట్టు. ఎన్నికల సమయంలో జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేళ్లలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారు” అని నిప్పులు చెరిగారు.

నేను భ‌యప‌డ‌ను!
ప్ర‌సంగాన్ని ప్రారంభిస్తూనే చంద్ర‌బాబు.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. “నేను సైకోకి భయపడను. సైకో పోవాలి…. సైకిల్ రావాలి. పులివెందుల నుంచి వచ్చి చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారు. కనిగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో ఉన్నా.. ఇతర ప్రాంతాల వలస వెళ్లి స్థిరపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత‌ కనిగిరి రూపురేఖలు మారుస్తాను. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ నినాదం. దేశంలో మొదటిసారి రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చారు. ప్రజలకి జగన్ ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చి.. 100 దోచుకుంటున్నారు“ అని విమ‌ర్శించారు.