ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మధ్య నెలకొన్న వివాదం ఒక పట్టాన తెగేలా లేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ తనపై వేటు వేయడాన్ని కోర్టులో సవాలు చేసి.. మళ్లీ పదవిలోకి రాగలిగారు రమేష్ కుమార్. అంతటితో ఈ వ్యవహారానికి తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. రమేష్ కుమార్ మరోసారి హైకోర్టు గడప తొక్కడం గమనార్హం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకుంటోందంటూ ఆయన ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు కేసులు వేస్తూ ఎన్నికల సిబ్బందిని వేధిస్తున్నారన్న రమేష్ కుమార్.. తమపై సీఐడి పెట్టిన కేసులను కొట్టి వేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కూడా కోర్టును అభ్యర్థించారు.
రమేష్ కుమార్ తన పిటిషన్లో హోం కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఐడీలను ప్రతివాదులుగా చేర్చారు. రమేష్ కుమార్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సహాయ కార్యదర్శి సాంబమూర్తి సైతం జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కోర్టులో మరో పిటిషన్ వేయడం గమనార్హం. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారించనుంది. వివిధ వ్యవహారాల్లో కోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకోవడం అలవాటైన జగన్ సర్కారుకు ఈ కేసుల్లో ఎలాంటి ఆదేశాలు అందుతాయో చూడాలి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది మార్చి మూడో వారంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను రమేష్ కుమార్ వాయిదా వేయడంతో వివాదం రాజుకుంది. ఆయన మీద జగన్ సహా వైకాపా నేతలు అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. రమేష్‌కు కులం ఆపాదిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్ అండ్ కో. తర్వాత ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ ఆయన్ని పదవి నుంచి తప్పించారు. ఐతే కొన్ని నెలల పాటు కోర్టులో పోరాడి రమేష్ మళ్లీ పదవిలో కూర్చున్నారు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వంతో ఆయనకు రగడ మొదలైంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.