మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, జరిగిన డెవలప్మెంట్ల ఆధారంగా అసమ్మతి నేతలపై కఠినంగా వ్యవహరించాలని బీజేపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయ్యింది. ఇందులో బాగంగానే ఢిల్లీనుండి వచ్చి సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అసమ్మతిపై వేటు వేయటంలో స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. పార్టీలో అసమ్మతిని మొగ్గలోనే తుంచేయటంలో భాగంగా ఎంతటి నేతలైనా సరే ఉపేక్షించవద్దని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అమిత్ షా స్పష్టంగా చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.
అందుకనే 3వ తేదీన పార్టీ క్రమశిక్షణా కమిటి సమావేశమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో జరిగిన వ్యవహారాలు కమిటి దృష్టికి వచ్చాయి. ఎన్నికల్లో ఓడిన అభ్యర్ధుల నియోజకవర్గాల నుండి ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నది. అభ్యర్ధుల ఓటమికి పనిచేసిన నేతలెవరు ? వాళ్ళు చేసిన ప్రయత్నాలేమిటనే వివరాలను రిపోర్టు రూపంలో తెప్పించుకున్నది. ఎనిమిది నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. మరో 16 నియోజకవర్గాల్లో రెండోప్లేసులో నిలిచింది.
అయితే ఇక్కడ నేతలంతా కలిసికట్టుగా పనిచేసుంటే మరో ఐదారు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచుండేదే అన్న భావనలో పార్టీనేతలున్నారు. ఎన్నికల సమయంలోనే కొన్ని నియోజకవర్గాల్లో నేతలు అభ్యర్ధులకు సహకరించటంలేదన్న ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో అభ్యర్ధులు ఏదో సర్దుబాటుకు ప్రయత్నించారు. అయితే ఫలితాల తర్వాత అప్పటి సర్దుబాట్లు పనిచేయలేదన్న విషయం అర్ధమైంది. అసమ్మతి, వెన్నుపోట్లు ఎక్కువగా కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు క్రమశిక్షణ కమిటికి పిర్యాదులు అందాయి. కరీంనగర్ ఎంపీ, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓటమికి కూడా వెన్నుపోట్లే అనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ విషయాన్ని పరోక్షంగా బండి కూడా ప్రస్తావించారు.
తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇలాంటి వెన్నుపోట్లకు అవకాశం ఇవ్వకూడదని, వెన్నుపోటు నేతలపై వేటు వేస్తేకాని మిగిలిన వాళ్ళు దారికిరారని కమలనాదులు నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయమై కఠినంగా వ్యవహరించమని కిషన్ కు అమిత్ షా చెప్పారని సమాచారం. అందుకనే నియోజకవర్గాల నుండి అందిన ఫిర్యాదులు, జిల్లాల అధ్యక్షుడు మంగళవారం ఇవ్వబోయే రిపోర్టులపై 3వ తేదీన క్రమశిక్షణ కమిటి చర్చలుంటాయి. తర్వాత రిపోర్టును కిషన్ కు అందచేస్తుంది కమిటి. అప్పుడు కిషన్ ఏమిచేస్తారన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates