టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి కొద్ది నెలలుగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తన తమ్ముడు చిన్నితో విభేదాల నేపథ్యంలో…పార్టీలో చిన్నికి ప్రాధాన్యత పెరిగిన కారణంతో పార్టీకి నాని కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అడపాదడపా చంద్రబాబుతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కనిపించినప్పటికీ గతంలో ఉన్నంత యాక్టివ్ గా పార్టీలో నాని లేరన్నది బహిరంగ రహస్యమే.
అయితే, తన తనయురాలు కేశినేని శ్వేతను విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దించేందుకు నాని ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ప్రచారంపై నాని స్పందించారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి తాను గాని, తన కుటుంబ సభ్యులు గాని పోటీ చేయడం లేదని నాని స్పష్టం చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సీటు బీసీ లేదా మైనారిటీలదేనని నాని అన్నారు.
ఇక, విజయవాడ పార్లమెంటు స్థానానికి తాను కాపలా కుక్క వంటి వాడిని, తన వెంట 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తాను టీడీపీలో లేకుంటే విజయవాడ పార్లమెంటు స్థానాన్ని జగ్గయ్యపేట నుంచి దోచుకోవచ్చు అన్నది కొందరి ఆలోచన అంటూ పరోక్షంగా నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇక, జగన్ ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారని, ఆయన సాధించింది ఏమీ లేదని నాని విమర్శలు గుప్పించారు. జగన్ పాలనపై వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్ధె దించడం ఖాయమని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజలతోనే ఉంటానని నాని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates