అక్క‌డ టీడీపీ గెలుపు ప‌క్కా.. టికెట్ కోసం నేత‌ల క్యూ..

హిందూపురం పార్ల‌మెంటు స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఈ సీటును వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచి తీరుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఇక్క‌డ గెలిచిన ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌.. త‌న న్యూడ్ వ్య‌వ‌హారంతో పార్టీ పరువు తీసేశారు. దీంతో ఇక్క‌డ వైసీపీ గెలిచే ప‌రిస్థితి లేద‌ని ఒక అంచ‌నాకు టీడీపీ నాయ‌కులు వ‌చ్చేశారు. క్షేత్ర‌స్థాయిలోనూ ప‌రిస్థితి ఇలానే ఉంద‌ని.. ప్ర‌జ‌లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నార‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో హిందూపురం పార్ల‌మెంటు సీటుకు టీడీపీలో భారీ డిమాండ్ ఏర్ప‌డింది. గెలుస్తామ‌ని తెలియ‌డంతో కీల‌క నాయ‌కులు, ఆర్థికంగా బ‌లంగా ఉన్న వారు ఈ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ఏకంగా ముగ్గురు నాయ‌కులు హిందూపురం టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయంగా హీటెక్కింది. ఈ క్ర‌మంలో ఎవరికి వారు టీడీపీ పెద్దలను కలిసి టికెట్ ప్లీజ్ అని విన్న‌విస్తున్నార‌ట‌.

టీడీపీ టికెట్‌ను ఆశిస్తున్న వారిలో బోయ, కురుబ, చేనేత సామాజిక వర్గాల నేతలు ఉన్నారు. ఇక‌, నేత‌ల విష‌యానికి వ‌స్తే.. బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖ వ్యాపారి అంబికా లక్ష్మీనారాయ‌ణ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. 2009లో కాంగ్రెస్‌ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈయ‌న అప్ప‌ట్లో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే టీడీపీ ఆయనకు ఇప్పటివరకు ఒకసారి కూడా టికెట్‌ ఇవ్వలేదు.

ప్రస్తుతం అంబికా హిందూపురం ఎంపీ సీటు ఆశిస్తున్నారు. బోయ సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణకు సొంత కులంలో ప‌ట్టు ఉండ‌డం, ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం వంటివి క‌ల‌సి వ‌స్తున్నాయి.  ఇక చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా చంద్ర‌బాబును క‌లిశార‌ని తెలిసింది. ఎంపీ సీటుకు మరోసారి పోటీ చేయాలని ఆయ‌న కూడా ఆశిస్తున్నారు. గతంలో వ‌రుస‌గా రెండు సార్లు ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు.
 
ఇక‌, ఇదే హిందూపురం ఎంపీ స్థానం నుంచి పుట్టపర్తికి చెందిన సామకోటి ఆదినారాయణ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈయ‌న కూడా. ఆర్థికంగా బ‌లంగా ఉన్న వ్య‌క్తే కావ‌డం.. వ్యాపారి కావ‌డం క‌లిసి వ‌స్తున్నాయి. ఇక‌, పెనుకొండ అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్న ముఖ్య నాయ‌కురాలు సవితమ్మ కూడా ఈ సీటు ఇవ్వ‌క‌పోతే.. హిందూపురం పార్ల‌మెంటు సీటు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఈవిడ కుర‌బ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు. ఇక‌, బీకే పార్థసారథి వంటి దిగ్గ‌జ నాయ‌కులు కూడా హిందూపురం ఎంపీ సీటుపై క‌న్నేశారు.  దీంతో ఈ సీటును ఎవ‌రికి కేటాయిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.