మొదటిజాబితా రెడీ అయ్యిందా?

తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేయబోతున్న 90 మంది అభ్యర్ధులతో మొదటిజాబితా రెడీ అయినట్లు సమాచారం. ఈ జాబితాను సంక్రాంతి పండుగ తర్వాత ప్రకటించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఈ 90 మందిలో సిట్టింగులు 19 మంది ఉండగా అదనంగా 71 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఫైనల్ అయ్యారట. వీరందరిని తమ నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని చంద్రబాబు డైరెక్టుగా మాట్లాడి ఆదేశించారట. సిట్టింగుల్లో రాజమండ్రి సిటి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని స్ధానంలో ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీచేయబోతున్నారు.

ఇక్కడ మాత్రమే అంతర్గతంగా జరిగిన మార్పు. అయితే సిట్టింగుల విషయంలో పార్టీలో కొంచెం అయోమయం కనబడుతోంది. అదేమిటంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి పోటీకి జనసేన బాగా పట్టుబడుతోంది. ఇక్కడ కందుల దుర్గేష్ పోటీచేయబోతున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఇక్కడ సీనియర్ తమ్ముడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉన్నారు. ఈ సీటు విషయంలో కాస్త అయోమయం ఉన్నదైతే వాస్తవం. పొత్తులో జనసేనకు ఎన్నిసీట్లు కేటాయించబోతున్నారనే విషయంపై క్లారిటిలేదు. అయితే దీనిపై చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లో క్లారిటి ఉండే ఉంటుంది.

అందుకనే చంద్రబాబు మొదటిజాబితాను రెడీచేసినట్లు చెప్పుకుంటున్నారు. బీజేపీ కూడా పొత్తులో కలిసొచ్చే అవకాశముందని లేటెస్టుగా ప్రచారం మొదలైంది. కాబట్టి జనసేన, బీజేపీకి ఇవ్వాల్సిన నియోజకవర్గాలను వదిలేసి మిగిలిన వాటిల్లో గట్టి అభ్యర్ధుల కోసం చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు. సీనియర్ తమ్ముళ్ళ కుటుంబాల్లో ఒకటికి మించి టికెట్లు కేటాయించలేమని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. ఒక్క కింజరాపు కుటుంబానికి మాత్రమే మినహాయింపిచ్చారు.

పొత్తుల విషయం తేలకపోవటంతోనే అభ్యర్ధుల ఎంపికలో బాగా జాప్యం జరుగుతోంది. ఈసారి అభ్యర్ధులను ముందుగా ప్రకటించి ప్రచారంచేసుకునేందుకు కావాల్సినంత సమయం ఇవ్వబోతున్నట్లు గతంలో చంద్రబాబే ప్రకటించారు. అయితే ఈసారి కూడా జాబితాను ఫైనల్ చేయటంలో ఆలస్యం జరగక తప్పేట్లులేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పాటు చంద్రబాబుకు కూడా చాలా కీలకం కాబట్టే పొత్తులు, అభ్యర్ధుల విషయాన్ని ఫైనల్ చేయటంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సొస్తోంది. రెండు టికెట్లు దక్కని సీనియర్లు ఎలా రియాక్టవుతారో చూడాలి.