జ‌గ్గంపేట జ‌గ‌డం.. నేత‌ల కుస్తీ!

తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గంపేట‌. కాపు సామాజిక వ‌ర్గానికి పెట్ట‌ని కోటగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు రాజ‌కీయ ర‌చ్చ తెర‌మీదికి వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధిం చి వైసీపీ ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని తేల్చి చెప్పింది. ఇదేస‌మ‌యంలో మాజీ ఎంపీ.. కాపు నాయ‌కుడు తోట న‌ర‌సింహానికి టికెట్ ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీంతో చంటిబాబు ఆగ్ర‌హంతో ఉన్న విష‌యం తెలిసిందే. పార్టీకి దూరంగా కూడా ఉన్నారు. సీఎం జ‌గ‌న్ అప్పాయింట్‌మెంటు కోసం ప్ర‌య‌త్నించారు. అయితే.. ఆయ‌న బిజీగా ఉండ‌డం.. పైగా తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉంటున్నార‌న్న వార్త‌లు అంద‌డంతో చంటిబాబు వెన‌క్కి త‌గ్గారు. ఇదిలావుంటే.. తోట న‌ర‌సింహానికి(వైసీపీ టికెట్ ఇంకా ఎనౌన్స్ చేయ‌లేదు).. టికెట్ ఇవ్వ‌డంపై స్థానిక కేడ‌ర్ ర‌గ‌లిపోతు న్నారు.

తోట స్థానికేత‌రుడ‌ని.. ఆయ‌న అస‌లు నియోజ‌క‌వ‌ర్గం పెద్దాపురం అని.. ఇస్తే..అక్క‌డ ఇచ్చుకోవాల‌ని అంటున్నారు. కానీ, తోట న‌ర‌సింహం ప‌ట్టుబ‌ట్టి.. జ‌గ్గంపేట ను కొర‌డంతోపార్టీ కాద‌నలేద‌ని మ‌రో చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీలో ఉన్న తోట‌.. కాకినాడ ఎంపీగా వ్య‌వ‌హ‌రించారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న పెద్దాపురం టికెట్‌ను కోరుకున్నారు. కానీ, అప్ప‌టి హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌కు చంద్ర‌బాబు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేశారు.

ఆయ‌న పెద్దాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో మ‌రోసారి నిమ్మ‌కాయ‌ల‌కే చంద్ర‌బాబు జైకొట్టారు. దీంతో తోట‌న‌ర‌సింహం.. పార్టీ మారి.. వైసీపీ త‌ర‌ఫున పెద్దాపురం టికెట్ ద‌క్కించుకుని పోటీ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఓడిపోయారు. ఓట‌మి త‌ర్వాత‌.. ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు..త‌న‌ను ఓడించేందుకు వైసీపీ నాయ‌కులే ప్ర‌య‌త్నించార‌ని వ్యాఖ్యానించారు. అయినా.. పెద్ద‌గా ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోలేదు.

పైగా ఇప్పుడు కీల‌క‌మైన జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గాన్ని తోట‌కు కేటాయించ‌డం.. ఇక్క‌డ నుంచి ప‌ట్టుబ‌డు తున్న జ్యోతుల చంటిబాబును సైతం ప‌క్క‌న పెట్ట‌డంతో రాజ‌కీయంగా ఇక్క‌డ ర‌చ్చ రేగింది. కాపుల్లోనే చాలా మంది అసంతృప్త నాయ‌కులు.. తోట‌కు వ్య‌తిరేకంగాబ్యాన‌ర్లు క‌ట్టారు. తోట ఏం చేశార‌ని.. ఇక్క‌డ గెలిపించాల‌ని అంటున్నారు. దీంతో ఈ విష‌యంలో వైసీపీ వెన‌క్కి త‌గ్గుతుంద‌నే ప్ర‌చారం ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.