షర్మిల గిఫ్ట్ విషయం నన్నడగొద్దు: లోకేష్

క్రిస్మస్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల క్రిస్ట్ మస్ గిఫ్ట్ పంపిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన సోదరుడు సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు గిఫ్ట్ పంపడం…ఆ గిఫ్ట్ పంపిన షర్మిలకు లోకేష్ ధన్యవాదాలు తెలపడం ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన లోకేష్ ను ఓ మీడియా ప్రతినిధి ఆ గిఫ్ట్ గురించి అడిగారు.

“షర్మిల మీకు క్రిస్మస్ గిఫ్ట్ పంపించినట్టు అనుకుంటున్నారు” అన్న ప్రశ్నకు లోకేష్ నవ్వుతూ బదులిచ్చారు. “అనుకోవడం ఏంటండీ…. ఆమె పంపించారు… దానిపై నేను ట్వీట్ చేశాను కూడా” అని లోకేష్ అన్నారు. గిఫ్ట్ ఎందుకు పంపారన్న విషయం అడగాల్సింది తనను కాదని అన్నారు. మరోవైపు, అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై సీఎం జగన్ కు లోకేష్ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ వారంలోపు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు.

జగన్ పాలనలో 600 మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని, హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్క కుటుంబానికైనా రూ.10 లక్షల సాయం ఇచ్చారా? ఇదేనా మీ మానవత్వం? అని నిలదీశారు. వైఎస్ హయాంలో అగ్రిగోల్డ్ పుట్టి ఆయన హయాంలోనే అగ్రిగోల్డ్ స్కాం జరిగిందని ఆరోపించారు. కానీ, 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక అగ్రిగోల్డ్ కు చెందిన 21 వేల ఎకరాల ఆస్తులు జప్తు చేశామని, అయినా సరే ఆనాటి ప్రతిపక్ష నేతగా టీడీపీపై జగన్ బురదజల్లారని గుర్తు చేశారు.