ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ఎమ్మిగనూరు. ఇది రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఉన్న అసెంబ్లీ స్థానం. ఈ నియోజకవర్గం నుంచి 1978లో జరిగిన ఎన్నికల నుంచి ఇప్పటి వరకు పార్టీ ఏదైనా రెడ్డి నాయకుడికే చోటు దక్కుతోంది. ఇతర సామాజిక వర్గాలకు చోటు ఇవ్వడమే లేదు. ఈ క్రమంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కె. చెన్నకేశవ రెడ్డి కూడా.. చాలా సీనియర్ నాయకుడు. అయితే, 80 +కు చేరుకోవడంతో ఆయనను పక్కన పెట్టాలనే పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. కానీ, చెన్నకేశవరెడ్డికి ఉన్న ఫామ్ అంతా ఇంతా కాదు. ఆయనకు సైలెంట్ నాయకుడిగా, వివాద రహిత నేతగా పేరుంది.
పైగా.. 2004 నుంచి 2012 వరకు వరుస విజయాలు చెన్నకేశవరెడ్డినే వరించాయి. ఇక, మధ్యలో ఆయనకు టికెట్ దక్కక పోయినా.. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ మరోసారి ఆయనకే టికెట్ ఇచ్చింది. ఆయన నిలబడితే చాలు.. గెలుస్తారనే పేరుండడంతో ఆయన కూడా అలానే విజయం దక్కించుకున్నారు. అయితే.. తాజా ఎన్నికల్లో మాత్రం చెన్నకేశవరెడ్డిని వయసు కారణంగా పక్కన పెట్టే యోచనలో ఉన్నారనేది వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ ఇదే సమయంలో బీసీలకు ఈ టికెట్ ఇచ్చి.. గెలిపించుకోవాలని పార్టీ భావిస్తున్నట్టు మరో వర్గం చెబుతోంది.
వెరసి.. ఇప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గం హాట్‌హాట్‌గా మారింది. చెన్న కేశవరెడ్డి కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన అనుచరులు పట్టుబడుతున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే వైసీపీ పార్టీ సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామా చేస్తామని రోడ్డెక్కారు. ప్రధానంగా వయసు ను కారణంగా చూపిస్తూ.. ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యే కేశవరెడ్డికి కాకుండా వేరే వారికి టికెట్ ఇస్తే తాము ఓటు వెయ్యబోమని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తేల్చిచెప్పారు.
బరిలో వీరు..
మరోవైపు ఎమ్మిగనూరు స్థానం నుంచి వైసీపీ టికెట్ పొందేందుకు.. మాజీ ఎంపీ, బీసీ నాయకురాలు బుట్టా రేణుక, బీసీ నేత రుద్ర గౌడ్, సంజీవ్ కుమార్ ఎవరు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వీరిలోనూ బుట్టా రేణుక ప్రధానంగా తెరమీదికి వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ తనకు టికెట్ ఇవ్వలేదని, అయినా.. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నానని ఆమె చెబుతున్నారు. దీంతో ఆమెకు దాదాపు ఎమ్మిగనూరు టికెట్ ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates