జగన్… రాజకీయాలకు అనర్హుడు: చంద్ర‌బాబు

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వ‌రుస కార్య‌క్ర‌మాల‌తో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. వివిధ మండ‌లాల్లో ఆయ‌న ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం కూడా ప‌ర్య‌టిస్తూ.. స‌భ‌ల్లో పాల్గొంటున్నారు. తాజాగా శాంతిపురం మండ‌లంలో ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు. జగన్ లాంటి పాలకుడు రాజకీయాలకు అనర్హుడని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు సేవ చేయడానికి కాదని విమ‌ర్శ‌లు గుప్పించారు

“ల్యాండ్ టైటిల్” చట్టం తెచ్చింది భూములు దోచేందుకేనని, ప్రజలకు ఇచ్చేది గోరంత..పబ్లిసిటీ మాత్రం కొండంత అని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. “శాంతిపురం నాకు కొత్త కాదు ఎప్పుడూ వస్తూనే ఉంటాను. కానీ మీలో ఈసారి ప్రత్యేకమైన అభిమానం కనబడుతోంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. నిన్న, నేడు మీ ఉత్సాహం చూశాక మన కుప్పంలో టీడీపీకి లక్ష ఓట్ల మెజార్టీ కష్టం కాదనిపిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ జండా రెపరెపలాడే నియోజకవర్గాలు రెండున్నాయి. ఒకటి కుప్పం..రెండోది హిందూపురం.” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

మీ పెద్ద కొడుకును!

కుప్పం నియోజ‌క వ‌ర్గానికి తాను పెద్ద‌కొడుకున‌ని చంద్ర‌బాబు అన్నారు. “నేను ఇక్కడ కులం, మతం, చూడకుండా మీ పెద్దకొడుకుగా ఉండాలని పని చేశాను. ఈ నియోజకవర్గంలో ఎవరికీ దక్కని అభిమానం నాకు దక్కింది. నేను నామినేషన్ వేయడానికి కూడా రావద్దని చెప్పి గెలిపించిన ఏకైక నియోజకవర్గం కుప్పం. మేము గెలిపించుకుంటాం. మీరు మళ్లీ సీఎంగా రావాలని కోరుతున్నారు. తెలుగుజాతికి కుప్పం ఒక ప్రయోగశాల” అని చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఈ రాష్ట్రంలో బతికే హక్కు లేదా

వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులుగామారి, ప్రజలను దోచుకున్నారంటే దానికి కారణం జగన్ అని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. కుప్పం నియోజకవర్గంలో 500 మందిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. “వైసీపీ వాళ్లను నేను సీఎం అయ్యాక వదిలిపెడతానా.? ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు.. సైకో కాదా? ఈ రాష్ట్రంలో బతికే హక్కు లేదా..ఏంటీ ఈ నియంత పోకడలు.? 14 ఏళ్లు సీఎంగా ఉన్నాను..ఎంతో మంది సీఎంలను చూశానుకానీ..ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు” అని చంద్ర‌బాబు ఫైర‌య్యారు.